ప్రాంతీయ శాంతి, సుస్థిరతలకు మద్దతుగా నిలుస్తామని ఈ సందర్భంగా మోదీ ఉద్ఘాటించారు. ప్రత్యేకమైన, గౌరవప్రదమైన భారత్, రష్యా వ్యూహాత్మక బంధం గత పదేళ్లలో మరింత ముందుకు సాగిందని తెలిపారు. ఇంధన, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, విద్య, సంస్కృతి, పర్యటకం వంటి రంగాలతోపాటు ప్రజల మధ్య సాంస్కృతిక బంధం విస్తృతమైందని పేర్కొన్నారు.
మాస్కో చేరుకున్న అనంతరం మోదీ తన ఎక్స్ ఖాతాలో.. ‘‘భారత్, రష్యాల మధ్య మరింత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకునేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా’’ అని పోస్ట్ చేశారు. ఇరుదేశాల మధ్య బలమైన బంధాలు ప్రజలకు ఎంతగానో లబ్ధిచేకూర్చుతాయని పేర్కొన్నారు.
మాస్కో విమానాశ్రయంలో ఆయనకు రష్యా తొలి ఉప ప్రధాని డెనిస్ మంటురోవ్ ఘన స్వాగతం పలికారు. అలాగే ఒకే కారులో మోదీతో కలిసి వెళ్లి, ఆయనకు బస ఏర్పాటు చేసిన హోటల్‌లో దింపారు. అనంతరం మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసానికి చేరుకున్నారు. ఆయన మోదీకి సాదర స్వాగతం పలికారు.
రష్యాలో ప్రొటోకాల్ ప్రకారం పుతిన్ తర్వాత స్థాయిలో మంటురోవ్ ఉంటారు. అలాంటి వ్యక్తి స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి మోదీకి స్వాగతం పలకడం ద్వారా చైనాకు గట్టి సంకేతాలు ఇచ్చినట్లయింది. గతంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఉప ప్రధాని స్వాగతం పలకగా.. మోదీ కోసం తొలి ఉప ప్రధాని మంటురోవ్ వెళ్లడం విశేషం.
ఈ చర్య ద్వారా రష్యా.. భారత్‌కు ఇస్తున్న ప్రాధాన్యాన్ని చెప్పకనే చెప్పినట్లయింది. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో మాస్కోలోని 1771 అడుగుల ఎత్తయిన ఒస్టాంకినో టీవీ టవర్‌ను భారత్, రష్యా జెండాల్లోని రంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. ఇది ప్రపంచంలోనే ఎత్తయిన టీవీ టవర్లలో నాలుగో స్థానంలో ఉంది.
సోమవారం రాత్రి “ఇద్దరు స్నేహితులు, విశ్వసనీయమైన భాగస్వాముల కలయిక అపూర్వం. మోదీని పుతిన్ ఘనంగా తన ఇంట్లోకి ఆహ్వానించారు” అని భారత విదేశాంగశాఖ ఎక్స్‌లో పేర్కొంది. మరోవైపు రష్యాలో హిందూ ఆలయంతోపాటు పాఠశాలను నిర్మించాలని ప్రవాస భారతీయులు కోరుకుంటున్నారు. ప్రధాని మోదీ రెండు రోజులపాటు రష్యాలో పర్యటించనున్నారు. మంగళవారం భారత్-రష్యా 22వ వార్షిక సదస్సులో పాల్గొననున్నారు. అదేవిధంగా రష్యాలోని భారత సంతతి ప్రజలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు.

More Stories
వందల మొబైల్ ఫోన్లు పేలడంతో బస్సు ప్రమాదం?
అమెరికా గుప్పిట్లో పాక్ అణ్వాయుధాలు
కశ్మీర్ రాజ్యసభ ఎన్నికల్లో ఎన్సీని అడ్డుకున్న బీజేపీ