
ముందుగా రెక్కీ నిర్వహించి స్థానికుల సాయంతో అత్యాధునిక ఆయుధాలు ఉపయోగించి ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కఠువా జిల్లాలో సోమవారం జరిగిన దాడికి గతంలో రియాసీలో బస్సుపై జరిగిన ఉగ్ర ఘటనకు పోలికలున్నాయి. మాచేడీ- కిండ్లీ- మల్హార్ రోడ్డులో బడ్‌నోటా అనే గ్రామం వద్ద రోడ్డు బాగోలేదు.
ఏ వాహనమైనా ఇక్కడ గంటకు 15 కిలోమీటర్ల వేగాన్ని మించకుండా వెళ్లాల్సిందే. ఉగ్రవాదులు ముందుగా రెక్కీ నిర్వహించి దాడికి ఈ ప్రాంతం అనువుగా ఉంటుందని గుర్తించి మాటువేశారు. ఇద్దరు లేదా ముగ్గురు పాక్ ఉగ్రవాదులకు ఒకరు లేదా ఇద్దరు స్థానిక గైడ్లు సాయం చేసినట్లు భద్రతా వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంపై పక్కాగా గురిపెట్టేలా సమీపంలోని ఓ కొండపై ముష్కరులు మాటు వేశారు.
వాహనం తమ టార్గెట్లోకి రాగానే తొలుత గ్రనేడ్ విసిరారు. ఆ తర్వాత తక్షణమే డ్రైవర్‌ను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు. అనంతరం నిలిచిపోయిన వాహనంపై విచక్షణారహితంగా రెండు వైపుల నుంచి కాల్పులు జరిపారు. ఆ తర్వాత స్థానిక గైడ్ సాయంతో ఉగ్రవాదులు అటవీ ప్రాంతం గుండా తమ స్థావరాలకు పారిపోయినట్లు భావిస్తున్నారు.
ముష్కరులు రెక్కీ నిర్వహించడానికి, వారికి ఆహారం సమకూర్చడానికి ఆ గైడ్లే సాయం చేశారు. గతంలోనూ ఉగ్రమూకలు ఇలా వాహన చోదకుడినే తొలుత టార్గెట్ చేసుకొన్నాయి. పాకిస్తాన్‌తో సరిహద్దు కలిగిన కఠువా ప్రాంతంలోకి రెండు నెలల క్రితమే పెద్దసంఖ్యలో విదేశీ ఉగ్రవాదులు చొరబడినట్లు భద్రతా దళాలకు సమాచారం ఉంది.
అమెరికా తయారీ ఎం4 కార్బైన్‌ను ఇటీవల కాలంలో ఉగ్రవాదులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. నాటో దళాలు వాడే ఎం16ఏ2కు ఇది తేలికపాటి రకం. 2021లో అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా దళాలు బిలియన్ల డాలర్లు విలువైన ఆయుధాలు వదిలి వెళ్లిపోయాయి. వీటిని పాక్‌లోని ఉగ్రసంస్థలైన లష్కరే, జైషేలు తాలిబన్ల నుంచి కొనుగోలు చేస్తున్నాయి.
అవి గత కొంతకాలంగా పాక్ మీదుగా కశ్మీర్‌లోకి మెల్లగా చేరుతున్నాయి. కఠువాలో సైనిక గస్తీ వాహనంపై ఉగ్రదాడికి తామే పాల్పడినట్లు ఉగ్ర సంస్థ కశ్మీర్ టైగర్స్ ప్రకటించింది. పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు దీన్ని షాడో సంస్థగా భావిస్తారు.
More Stories
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు