బ్రిటన్ ఎన్నికల్లో 26 మంది భారత సంతతి వారు ఎన్నిక

బ్రిటన్ ఎన్నికల్లో 26 మంది భారత సంతతి వారు ఎన్నిక

బ్రిటన్ లో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కన్సర్వేటివ్ లు ఓటమిపాలయినా ఇప్పటి వరకు ప్రధానిగా ఉన్న రిషీ సునాక్ తో పాటు పలువురు భారత సంతతి వారు ఈ ఎన్నికల్లో గెలుపొందారు. ఈసారి బ్రిటన్ ఎన్నికల్లో మొత్తం 107 మంది భారతీయ మూలాలున్న నేతలు పోటీ చేశారు. వీరిలో 26 మంది గెలిచారు.

ప్రస్తుతం బ్రిటన్ పార్లమెంట్ లో కేవలం 15 మంది మాత్రమే భారతీయ మూలాలున్న ఎంపీలున్నారు. దీంతో పోలిస్తే మరో 11 మంది ఈసారి అదనంగా ఎన్నికై నట్లయింది. అంతే కాదు బ్రిటన్ లో బ్రిటీష్ ఇండియన్ల ప్రభావం ఏ స్ధాయిలో ఉందో ఈ ఫలితాలు మరోసారి రుజువు చేశాయి. గత ఎన్నికల్లో లేబర్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేసిన బ్రిటీష్ ఇండియన్లు ఈసారి మాత్రం ఆ పార్టీకి అండగా నిలిచారు.

650 మంది సభ్యులున్న హౌస్ ఆఫ్ కామన్స్ కు జరిగిన ఎన్నికల్లో పలువురు భారతీయ మూలాలున్న వారు గెలుపొందారు. ఇందులో రుషీ సునాక్ తో పాటు ప్రీత్ కౌర్ గిల్, ప్రీతీ పటేల్, గగన్ మొహీంద్రా, కనిష్కా నారాయణ్, నవేందు మిశ్రా, లీసా నందీ ఉన్నారు. సువెల్లా బ్రేవర్మెన్, శివానీ రాజా, తమన్ జీత్ సింగ్ థేసీ ఉన్నారు. వీరిలో పలువురు లేబర్ పార్టీ నేతలు కూడా ఉన్నారు. వీరంతా హౌస్ ఆఫ్ కామన్స్ లో అడుగుపెట్టబోతున్నారు.