బీహార్‌లో 16మంది ఇంజనీర్ల సస్పెన్షన్

బీహార్‌లో 16మంది ఇంజనీర్ల సస్పెన్షన్

బీహార్‌లో గడచిన 15 రోజుల్లో పది వంతెనలు కూలిపోయిన పర్యవసానంగా రాష్ట్ర జల వనరుల శాఖ ఇంజనీర్లు 16 మందిని సస్పెండ్ చేసినట్లు ఆ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.  కూలిన బ్రిడ్జిల స్ధానంలో నూతన వంతెనల పునర్నిర్మాణానికి నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని బిహార్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దోషులుగా తేలిన కాంట్రాక్టర్ల నుంచి పునర్నిర్మాణ ఖర్చును రాబట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఫ్లయింగ్‌ స్వాడ్స్‌ తమ నివేదికలను సమర్పించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది. బ్రిడ్జిలు కూలిన ఘటనల వెనుక ప్రధానంగా అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం ముఖ్య కారణాలని నివేదిక స్పష్టం చేసింది. ఇంజనీర్లు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, కాంట్రాక్టర్లపై పర్యవేక్షణ కొరవడటం ఫలితంగా ఈ ఘటనలు చోటుచేసుకున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి చైతన్య ప్రసాద్‌ ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని తీవ్ర విషయంగా పరిగణిస్తున్నదని,  వంతెనల నిర్మాణానికి బాధ్యులైన కాంట్రాక్టర్ల జాడ తీస్తామని, వారిపై చర్య తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని శరణ్ జిల్లాలో గురువారం 10వ వంతెన కూలిపోయింది. 24 గంటల్లో శరణ్ జిల్లాలో కూలిన మూడవ వంతెన అది. కూలిపోయిన 10 వంతెనలు శివన్, శరణ్, మధుబని, అరారియా, తూర్పు చంపారణ్, కిషన్‌గంజ్ జిల్లాలో ఉన్నాయి.

‘అన్ని పాత వంతెనలపై సర్వే చేయాలని, తక్షణ మరమ్మతులు అవసరమైన వాటిని గుర్తించాలని బుధవారం సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి (నితీశ్ కుమార్) అధికారులను ఆదేశించారు’ అని ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి విలేకరులకు తెలియజేశారు. వంతెనలు కూలిపోవడంపై దర్యాప్తు సాగుతోందని ఆయన చెప్పారు.

కాగా, జూన్ 18 నుంచి బీహార్‌లో 12 వంతెనలు కూలిపోయాయని ఆర్‌జెడి నేత తేజస్వి యాదవ్ ఆరోపించారు. ‘జూన్ 18 నుంచి బీహార్‌లో 12 వంతెనలు కూలిపోయాయి. బీహార్‌లో ఈ సంఘటనలపై ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇద్దరూ మౌనం వహించారు. సత్పరిపాలన, అవినీతి రహిత ప్రభుత్వం ప్రకటనలకు ఏమైంది?’ అని తేజస్వి ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి శాఖలో అవినీతి ఎంతగా ప్రబలిపోయిందో ఈ సంఘటనలు సూచిస్తున్నాయి’ అని తేజస్వి ఆరోపించారు.

కాగా, బీహార్ రోడ్డు నిర్మాణ శాఖ ఒక వంతెన నిర్వహణ విధానాన్ని సిద్ధం చేసి, సాధ్యమైనంత త్వరగా తన ప్లాన్‌ను రూపొందించవలసిందిగా గ్రామీణ పనుల శాఖను కోరింది. తేజస్వి యాదవ్ 15 నెలలకు పైగా గ్రామీణ పనుల శాఖను నిర్వహించినప్పుడు ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు ఏమీ చేయలేదని రాష్ట్ర గ్రామీణ పనుల శాఖ మంత్రి అశోక్ చౌదరి విమర్శించారు.

‘పూర్వపు మహాఘట్‌బంధన్ ప్రభుత్వ హయాంలో 15 నెలలకు పైగా తాను ఈ మంత్రిత్వశాఖను నిర్వహించిన విషయాన్ని ఆర్‌జెడి నేత (తేజస్వి యాదవ్) గుర్తుంచుకోవాలి. అప్పుడు ఆయన ఏమి చేశారు? ఈ సంక్షోభానికి పూర్వపు ఆర్‌జెడి సారథ్య బీహార్ ప్రభుత్వాన్ని, ఆయనను బాధ్యులను చేయాలి’ అని అశోక్ చౌదరి ఎద్దేవా చేశారు.