బ్రిటన్‌ ఎన్నికల్లో విజేత కైర్‌ స్టార్మర్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి బ్రిటన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న లేబర్ పార్టీకి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  అభినందనలు తెలిపారు. బ్రిటన్ ప్రధాని పీఠం ఎక్కనున్న కైర్ స్టార్మర్‌కు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సమయంలోనే కన్జర్వేటివ్ పార్టీ ఓటమిపై స్పందిస్తూ.. బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్‌ను ఓదార్చారు. ఈ మేరకు ప్రధాని మోదీ వరుస ట్వీట్లు చేశారు.

భారత్, బ్రిటన్ దేశాల మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు బ్రిటన్‌ కొత్త ప్రభుత్వంతో కలిసి నడిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మోదీ పేర్కొన్నారు. ‘యూకే సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కైర్‌ స్టార్మర్‌కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. యూకేతో పరస్పర వృద్ధిని, శ్రేయస్సును పెంపొందించే అన్ని రంగాల్లో సమగ్ర వ్యూహాత్మక భాగస్వా్మ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు మేము సానూకూల, నిర్మాణాత్మక సహకారం కోసం ఎదురు చూస్తున్నాం’ అని మోదీ తన ఎక్స్‌ పోస్టులో రాశారు.

 
ఇదే క్రమంలోనే ఈసారి బ్రిటన్ ఎన్నికల్లో పరాజయం పాలైన కన్జర్వేటివ్ పార్టీ లీడర్, బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఓదార్చారు. బ్రిటన్‌కు ప్రశంసనీయ నాయకత్వాన్ని అందించినందుకు ధన్యవాదాలు అని తెలిపారు. ప్రధానిగా ఉన్న సమయంలో భారత్, బ్రిటన్ మధ్య ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు.. మీరు అందించిన సహకారం చాలా విలువైందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అంతేకాకుండా రిషి సునాక్, ఆయన కుటుంబానికి భవిష్యత్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. 
 

ఇప్పటివరకూ ప్రకటించిన నియోజకవర్గాల ఫలితాల్లో లేబర్‌ పార్టీ 412 స్ధానాల్లో గెలుపొందగా, కన్జర్వేటివ్‌ పార్టీ 120 స్ధానాలకే పరిమితమైంది. 2019 ఎన్నికల్లో కన్జర్వేటర్లు 365 స్ధానాల్లో విజయం సాధించారు. అప్పటి ఎన్నికల్లో లిబరల్‌ డెమోక్రాట్లు71 స్ధానాలను స్కాటిష్‌ నేషనల్‌ పార్టీ 9 స్ధానాలను గెలుచుకున్నాయి. రిఫాం యూకే 4 నియోజకవర్గాల్లో గెలుపొందింది.