యూకే ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం

బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతున్నది. ఎగ్జిట్‌పోల్స్‌ను నిజం చేస్తూ 14 ఏండ్లపాటు అధికారం చెలాయించిన కన్జర్వేటివ్‌ పార్టీకి భారీ ఓటమి తప్పేలా లేదు. కీర్‌ స్టార్మర్‌ నేతృత్వంలోని లేబర్‌ పార్టీ ఘన విజయం దిశగా దూసుకెళ్తున్నది.  650 సీట్లున్న పార్లమెంట్‌లో లేబర్ పార్టీ ఇప్పటివరకు 326 సీట్లకు పైగా గెల్చుకుంది. 
 
దీంతో కన్జర్వేటివ్ పార్టీ నేతృత్వంలోని 14 ఏళ్ల ప్రభుత్వ పాలనకు తెరపడింది. జూలై 4న జరిగిన ఓటింగ్ ఫలితాలు శుక్రవారం ఉదయం వెలువడ్డాయి. దీంతో లేబర్ పార్టీకి చెందిన నేత కీర్ స్టార్మర్ బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

ఇక భారత సంతతికి చెందిన కన్జర్వేటివ్ పార్టీ రిషి సునాక్‌కు ఇప్పటివరకు 73 సీట్లు మాత్రమే వచ్చాయి. లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ 45 సీట్లను గెల్చుకుంది.  సునాక్ తన రిచ్‌మండ్, నార్తలెర్టన్ స్థానాలను గెలుచుకున్నారు. లేబర్ పార్టీ ప్రధాని అభ్యర్థి కైర్ స్టార్మర్ లండన్‌లోని హోల్‌బోర్న్, సెయింట్ పాన్‌క్రాస్ స్థానాలను కూడా గెలిచారు. 

”మనం సాధించాం. ఈ విజయం కోసమే మీరు ప్రచారం చేశారు.. పోరాటం చేశారు.. ఓటు వేశారు.. దానిని ఇప్పుడు మనం సాధించాం” అని లేబర్ పార్టీ నాయకుడు కైర్ స్టార్మర్ ఫలితాలపై స్పందిస్తూ చెప్పారు. ”మార్పు ఇప్పుడు ప్రారంభమవుతుంది. నాలుగున్నరేళ్ల కృషి ఇది. లేబర్ పార్టీ మన దేశానికి సేవ చేయడానికి సిద్ధంగా ఉంది.  శ్రామిక ప్రజల సేవ చేస్తూ బ్రిటన్‌ను పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉంది.” అని ఆయన తెలిపారు.

ఫలితాలు ప్రకటించిన తర్వాత, సునాక్ తన ఓటమిని అంగీకరించారు. బ్రిటన్ ప్రజలు వారి తీర్పును ఇచ్చారని, దాని నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉందని సునాక్ అన్నారు. దీనికి బాధ్యత వహిస్తానని, కష్టపడి పనిచేసిన పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఈ సందర్భంగా క్షమాపణలు చెప్పారు. ఈ క్రమంలోనే స్టార్మర్‌కు ఫోన్ చేసి విజయంపై అభినందనలు తెలియజేశారు.

‘‘ఈ రోజు అధికారం శాంతియుతంగా.. ప్రజాస్వామ్యబద్దంగా అన్ని వైపులా సద్భావనతో మార్పిడి జరుగుతుంది… అది మన దేశ స్థిరత్వం.. భవిష్యత్తుపై మనందరికీ విశ్వాసం కలిగించే విషయం… నన్ను క్షమించండి.. ఓటమికి నేను బాధ్యుణ్ని..’’ అని ఆయన చెప్పారు.
 
ఫలితాలపై ఆయన మాట్లాడుతూ. “దేశవ్యాప్తంగా మార్పు కోసం సిద్ధంగా ఉన్నారు.. మార్పు ఇక్కడే మొదలువుతుంది ’’ అని తెలిపారు. బ్రెగ్జిట్, దశాబ్దకాలంగా కొనసాగుతోన్న జీవన వ్యయ సంక్షోభం నుంచి ఉపశమనం కల్పిస్తానని ఆయన వాగ్దానం చేశారు. అయితే, వీటి నుంచి బయటపడటం ఆయన హామీ ఇచ్చినంత సులభం కాదు అంటూ వ్యాఖ్యానించారు. 
బ్రిటన్‌ కాలమానం ప్రకారం గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. దాదాపు 4.6 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఈసారి 2019తో పోలిస్తే తక్కువ పోలింగ్‌ నమోదైంది. గత ఎన్నికల్లో అది 67 శాతంగా ఉన్నది.
 
2019లో సునాక్ కన్జర్వేటివ్ పార్టీకి 365 సీట్లు, కైర్ స్టార్మర్స్ లేబర్ పార్టీకి 202 సీట్లు, లిబరల్ డెమోక్రాట్లకు 11 సీట్లు వచ్చాయి. ఈసారి దాదాపుగా అన్ని సర్వేలు కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూశాయి. YouGov సర్వేలో, లేబర్ పార్టీకి 425 సీట్లు, కన్జర్వేటివ్‌లకు 108, లిబరల్ డెమోక్రాట్‌లకు 67, ఏం ఎన్ పి కి 20 సీట్లు వస్తాయని అంచనా వేసింది.