స్టాక్‌ మార్కెట్లలో భారీ హెచ్చుతగ్గులపై సిజెఐ హెచ్చరిక

స్టాక్‌ మార్కెట్‌లో రికార్డు స్థాయిలో హెచ్చుతగ్గులు నమోదవుతున్న నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా వుండాలని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ హెచ్చరించారు. సెన్సెక్స్, నిఫ్టీ లు కొత్త కొత్త జీవిత కాల గరిష్ట స్థాయిలకు చేరినందున నియంత్రణ సంస్థలు అయిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రిబ్యునల్స్ (శాట్)లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 
 
ఒక వైపు పెరుగుదలను సెలబ్రేట్ చేసుకుంటూనే వెన్నెముక శక్తివంతంగా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. బిఎస్ఈ సెన్సెక్స్ తొలిసారి బుధవారం 80 వేల పాయింట్స్ కు చేరిన విషయం తెలిసిందే. గురువారం నాడు కూడా మరో కొత్త రికార్డు స్థాయికి చేరుకొని తొలిసారి సెన్సెక్స్ 80 వేల పాయింట్స్ పైన ముగిసింది. ఈ తరుణంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మార్కెట్లపై హెచ్చరిక జారీచేయటం ప్రాధాన్యత సంతరించుకుంది.
 
భారత్‌ చాలా ఉన్నత స్థాయిలోకి ప్రవేశిస్తున్న క్షణమిదని వ్యాఖ్యానించారు. అయితే ఇటువంటి సమయాల్లోనే రెగ్యులేటరీ అధికారులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, సమతుల్యత కోల్పోకుండా చూడాలని కోరారు. ముంబయిలోని కొత్త ఎస్‌ఎటి సముదాయాన్ని ఆయన గురువారం ప్రారంభిస్తూ స్టాక్‌ మార్కెట్‌లో ఊపు, ఉత్సాహాన్ని ఎక్కువగా చూస్తున్నపుడు సెబి, ఎస్‌ఎటిల పాత్ర మరింత పెరుగుతుందని చెప్పారు.
 
సుస్థిరమైన, భవిష్యత్‌ పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని నెలకొల్పడంలో సెబి, ఎస్‌ఎటి వంటి వేదికలకు గురుతరమైన జాతీయ ప్రాముఖ్యత వుందని ఆయన చెప్పారు. తమపెట్టుబడులను చట్టం కాపాడుతుందని, వివాదాలు తలెత్తితే వాటిని పరిష్కరించే సమర్ధవంతమైన యంత్రాంగం వుందని పెట్టుబడుదారులు నమ్మేలా వ్యవహరించాలని పేర్కొన్నారు. 
 
దేశ మార్కెట్లలో వారు మరింగా పెట్టుబడులు పెట్టేలా చూడాలని చెబుతూ ఇలా పెట్టుబడులు వెల్లువెత్తడం వల్ల మరింత మెరుగైన ఆర్థిక ప్రయోజనాలు చేకూరతాయని ఆయన తెలిపారు. ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, మొత్తంగా సర్వతోముఖాభివృద్ధి చోటు చేసుకుంటుందని చెప్పారు.
 
ఇది ఇలా ఉంటే సెన్సెక్స్ అత్యంత వేగంగా పదివేల పాయింట్స్ పెరగటంలో కేవలం ఐదు అంటే ఐదు షేర్లు 50 శాతం మేర భాగస్వాములు అయ్యాయి. అందులో రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతి ఎయిర్ టెల్ , ఎస్ బిఐ , మహీంద్రా అండ్ మహీంద్రా, ఐసిఐసిఐ బ్యాంకు ఉన్నాయి. కేంద్రంలో మూడవ సారి భాగస్వాములతో కలిసి బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంతో మార్కెట్ లు బ్రేకులు లేని వాహనంలాగా దూసుకెళుతూనే ఉన్నాయి.