మచిలీపట్నంలో రూ.60వేల కోట్లతో భారత్ పెట్రోలియం రిఫైనరీ

మచిలీపట్నంలో రూ.60వేల కోట్లతో భారత్ పెట్రోలియం (బీపీసీఎల్‌) రిఫైనరీ ఏర్పాటు చేయనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురితో సమావేశం జరిపిన సందర్భంగా ఈమేరకు రిఫైనరీ ఏర్పాటుచేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. నాలుగేళ్లలో రిఫైనరీ పూర్తవుతుందని, దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారని అధికారవర్గాలు తెలిపాయి.
 
బీపీసీఎల్‌ రిఫైనరీ ఏర్పాటు కోసం సుమారు 2-3 వేల ఎకరాల భూమి అవసరమని కేంద్ర మంత్రి హర్‌దీప్‌సింగ్ పురి సూచించారు. ఈ భూమి మచిలీపట్నంలో అందుబాటులో ఉందని, ఒకవేళ ఇంకా భూమి కావాలన్నా ఇస్తామని మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి చెప్పారు. భూమి విషయంలో కేంద్రమంత్రి పురి, చంద్రబాబు సానుకూలంగా ఉన్నారు. 
 
అలాగే బీపీసీఎల్‌ రిఫైనరీ ఏర్పాటుకు మచిలీపట్నం అయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని, అలాగే రాజధాని అమరావతికి సైతం దగ్గరగా ఉంటుందని, మచిలీపట్నం పోర్టు కూడా అందుబాటులో ఉంటుందని వివరించారు. మచిలీపట్నంలో బీపీసీఎల్‌ రిఫైనరీ ఏర్పాటుతో ఆ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది అంటున్నారు. స్థానికులు, యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
 
మరోవైపు భారత్ పెట్రోలియం కంపెనీ రిఫైనరీ ఏర్పాటుకు సంబంధించి యాజమాన్యం కోరిన అంశాలపైనా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ రిఫైనరీ ఏర్పాటు ద్వారా భారీ పెట్టుబడులు పెట్టడానికి ఇటు ఏపీ ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలపై కూడా యాజమాన్యం ఆరా తీసినట్లు సమాచారం. 
 
ప్రధానంగా యాజమాన్యం మధ్యప్రదేశ్‌లో రిఫైనరీ ఏర్పాటు చేసినందుకు అక్కడి ప్రభుత్వం రూ.500 కోట్ల రుణం ఇచ్చిందట. అంతేకాదు 15 ఏళ్ల పాటు జీఎస్టీ మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే సంస్థ యాజమాన్యం ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం.  ఈ ప్రాజెక్ట్ ఏర్పాటుతో వేలమంది స్థానికులకు ఉపాధి దొరుకుతుందని చెబుతున్నారు. 
 
ఈ రీఫైనరీ ఏర్పాటుకు తీర ప్రాంతం అనువుగా ఉంటుందని భావిస్తున్నారు. మచిలీపట్నం అనుకూలంగా ఉంటుంది అంటున్నారు.అంతేకాదు ఈ బీపీసీఎల్‌ రిఫైనరీ ప్రాజెక్టును దక్కించుకోవడానికి ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్‌ కూడా పోటీపడ్డాయి. అయితే ఇప్పటికే ముంబై, మధ్యప్రదేశ్‌, కొచ్చిలో భారత్ పెట్రోలియం కంపెనీ (బీపీసీఎల్) రిఫైనరీలు కొనసాగుతున్నాయి. 
 
కొత్తగా మరో రిఫైనరీ ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని బీపీసీఎల్‌ ప్రతిపాదనలు తీసుకొచ్చింది. ఈ క్రమంలో తరుణంలో తీరప్రాంతం అనువుగా ఉంటుందని భావించారు. ఈ క్రమంలో ఏపీ వైపు మొగ్గు చూపారు. అందులో మచిలీపట్నం అయితే బావుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే ఈ అంశంపై కూడా స్పష్టత రానుంది.