నేపాల్ ప్రధాని ‘ప్రచండ’కు పదవీ గండం!

నేపాల్​లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. నేపాలీ కాంగ్రెస్​ అధ్యక్షుడు షేర్ బహదార్​ దేవ్​బా, బుధవారం ప్రధాని పుష్ప కమల్​ దహల్​ ‘ప్రచండ’ను పదవికి రాజీమానా చేయాలని కోరారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ప్రచండ సహకరించాలని సూచించారు. మాజీ గెరిల్లా నాయకుడైన ప్రచండను ప్రధాని పదవి నుంచి తొలగించేందుకు, అధికార సంకీర్ణ కూటమి భాగస్వామి అయిన సీపీఎన్-యూఎంఎల్​ నిర్ణయించుకుంది.

ఇప్పటికే ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది. అంతేకాదు ఆ పార్టీకి చెందిన మంత్రులు ప్రభుత్వం నుంచి వైదొలుగతూ మూకుమ్మడిగా రాజీనామాలు కూడా చేశారు. ‘నేపాలీ కాంగ్రెస్​, యూఎంఎల్​ కలిసి కొత్త ఏర్పాటు చేస్తాయి. కనుక ప్రధాని పదవికి పుష్ప కమల్ దహల్ ప్రచండ రాజీనామా చేయాలి’ అని దేవ్​బా స్పష్టం చేశారు.

ఖాట్మండు శివార్లలోని బుధానిలకంఠలో తన నివాసంలో జరిగిన పార్టీ కీలక సమావేశం అనంతరం ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధానులైన ‘నేపాలీ కాంగ్రెస్’ అధ్యక్షుడు దేవ్​బా, ‘కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్​ – యూనిఫైడ్​ మార్క్సిస్ట్​, లెనినిస్ట్​’  ఛైర్మన్ కేపీ శర్మ ఓలి సోమవారం కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నారు.

పార్లమెంట్లో మిగిలిన కాలమంతా రోటేషన్​ పద్ధతిలో ప్రధానమంత్రి పదవిని పంచుకునేందుకు పరస్పర అంగీకారానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రచండ నేతృత్వంలోని ప్రభుత్వానికి బుధవారం సీపీఎన్​-యూఎంఎల్​ పార్టీ మద్ధతు ఉపసంహరించుకుంది.

అంతేకాదు ప్రచండ క్యాబినెట్​లోని 8 మంత్రులు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. వీరిలో నేపాల్ ఉప ప్రధాని, రవాణా మంత్రులు కూడా ఉన్నారు. వాస్తవానికి సీపీఎన్-యూఎంఎల్​ మార్చి 5న ప్రభుత్వంలో చేరింది. దానితో ప్రధాని ప్రచండ అప్పటి వరకు భాగస్వామిగా ఉన్న నేపాలీ కాంగ్రెస్​ను విడిచిపెట్టారు. అయితే తాజాగా ఆ రెండు పార్టీలు కలిసి, ప్రచండను పదవి నుంచి దించే ప్రయత్నాల్లో ఉన్నాయి.

275 మంది సభ్యుల ప్రతినిధుల సభలో అతిపెద్ద పార్టీ అయిన నేపాలీ కాంగ్రెస్‌కు ప్రస్తుతం 89 సీట్లు ఉన్నాయి. సీపీఎన్​- యూఎంఎల్​ పార్టీకి 78 సీట్లు ఉన్నాయి. దిగువ సభలో 138 సీట్ల మెజారిటీకి, వారి ఉమ్మడి బలం 167 సరిపోతుంది. ప్రచండ పార్టీకి కేవలం 32 సీట్లు మాత్రమే ఉన్నాయి.