సెన్సెక్స్ తొలిసారిగా 80,000 పాయింట్లకు

 
* స్టాక్ బ్రోకర్లకు సెబీ కొత్త నిబంధనలు

దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయి. సెన్సెక్స్ తొలిసారిగా 80,000 పాయింట్లను అధిగమించడంలో విజయవంతమైంది. అయితే మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 545 పాయింట్ల లాభంతో 79,987 వద్ద ముగిసింది. నిఫ్టీ 163 పాయింట్ల జంప్‌తో 24,286 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ కేవలం 139 రోజుల్లోనే 10,000 పాయింట్లు జంప్ చేసి, అత్యంత వేగవంతమైన ర్యాలీగా రికార్డును నెలకొల్పింది. 

2023 డిసెంబర్ 11న ఈ సూచీ 70,000 పాయింట్ల వద్ద ఉంది. జూలై 3న 80,000 పాయింట్లను తాకింది. అదే సమయంలో సెన్సెక్స్ 60 వేల నుండి 70 వేలకు చేరుకోవడానికి 2 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టింది. ఈ ఏడాది ఇప్పటివరకు సెన్సెక్స్ 10 శాతం, గత ఏడాది కాలంలో 22 శాతం పెరిగింది.  నిఫ్టీ బ్యాంక్ మొదటిసారి 53,000 మార్క్‌ను దాటింది, ఈ ఇండెక్స్‌లో 1,000 పాయింట్ల పెరుగుదల కనిపించింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్‌లలో కూడా కొనుగోళ్లు కనిపించాయి. భారత స్టాక్ మార్కెట్ బలమైన పెరుగుదల కారణంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంది. 

బిఎస్‌ఇ డేటా ప్రకారం, బుధవారం లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.445.50 లక్షల కోట్ల వద్ద ముగిసింది. ఇది క్రితం సెషన్‌లో రూ.442.18 లక్షల కోట్ల వద్ద ఉంది. అంటే ఒక్క రోజులోనే ఇన్వెస్టర్ల సంపద రూ.3.32 లక్షల కోట్లు పెరిగింది. బిఎస్‌ఇ 500 స్టాక్స్‌లో 20 మల్టిబ్యాగల్ స్టాక్‌లు అయ్యాయి.

సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 24 లాభపడగా, 6 పతనమయ్యాయి. బ్యాంకింగ్, పవర్, మెటల్ షేర్లు మరింత బుల్లిష్‌గా ఉన్నాయి. టాటా కన్స్యూమర్ షేర్లు 3.55 శాతం లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఇ సెక్టోరల్ ఇండెక్స్‌లో నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ అత్యధికంగా 2.02 శాతం పెరిగింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.82 శాతం, నిఫ్టీ బ్యాంక్ 1.77 శాతం లాభపడ్డాయి. 

మీడియా మినహా అన్ని రంగాల సూచీల్లో పెరుగుదల కనిపించింది. స్టాక్స్‌ను పరిశీలిస్తే, అదానీ పోర్ట్ 2.49 శాతం, కోటక్ బ్యాంక్ 2.37 శాతం, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 2.18 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2.07 శాతం, ఇండస్‌ఇన్స్ బ్యాంక్ 1.82 శాతం, ఎస్‌బిఐ 1.66 శాతం, పవర్ గ్రిడ్ 1.41 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.25 శాతం. టాటా స్టీల్ 1.06 శాతం లాభంతో ముగిశాయి.  మరోవైపు టిసిఎస్ 1.27 శాతం, టైటాన్ 1.14 శాతం, రిలయన్స్ 0.86 శాతం, టాటా మోటార్స్ 0.54 శాతం, ఎల్ అండ్ టి 0.26 శాతం, ఏషియన్ పెయింట్స్ 0.03 శాతం నష్టపోయాయి.

ఇలా ఉండగా, మార్కెట్ రెగ్యులేటర్ సెబీ (సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) స్టాక్ బ్రోకర్లకు కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. మార్కెట్‌లో అక్రమాలను గుర్తించడం, నిరోధించడం స్టాక్ బ్రోకర్ల బాధ్యత, ఇప్పటివరకు స్టాక్ బ్రోకర్లకు అలాంటి సదుపాయం లేదు. స్టాక్ బ్రోకర్లు ఒక సంస్థాగత యంత్రాంగాన్ని రూపొందించడానికి సెబీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

బ్రోకర్లకు సంస్థాగత ఏర్పాటు ప్రకారం, బ్రోకింగ్ సంస్థలు వారి సీనియర్ మేనేజ్‌మెంట్‌తో పాటు నియంత్రణ వ్యవస్థలతో మోసాలను గుర్తించడం, నిరోధించడం కోసం జవాబుదారీగా ఉంటాయి. బ్రోకర్లు రిపోర్టింగ్ వ్యవస్థను కూడా సిద్ధం చేయాలి. సెబీ మోసం లేదా మార్కెట్ దుర్వినియోగానికి సంబంధించిన జాబితాను విడుదల చేసి, వాటిని పర్యవేక్షించవలసి ఉంటుంది. వీటిలో తప్పుగా సూచించడం, ధరల తారుమారు, ఫ్రంట్ రన్నింగ్ (సున్నితమైన సమాచారం ప్రయోజనాన్ని పొందడం),

ఇన్‌సైడర్ ట్రేడింగ్, తప్పుగా అమ్మడం, అనధికారిక వ్యాపారం వంటివి ఉండవచ్చు. జూన్ 27న విడుదల చేసిన ఈ నోటిఫికేషన్‌లో స్టాక్ బ్రోకర్లు అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించిన 48 గంటల్లో స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేయాలని సెబీ పేర్కొంది. దీంతోపాటు అనుమానాస్పద కార్యకలాపాలు, మోసం, మార్కెట్ దుర్వినియోగం కేసులపై విశ్లేషణతో పాటు తీసుకున్న చర్యలను సమర్పించాల్సి ఉంటుంది. 

స్టాక్ బ్రోకింగ్ కంపెనీలు అనుమానిత మోసపూరిత,అనైతిక కార్యకలాపాల కేసులను లేవనెత్తడానికి ఉద్యోగులు, ఇతర వాటాదారులకు రహస్య మార్గాన్ని అందించే విజిల్‌బ్లోయర్ విధానాన్ని ఏర్పాటు చేసి అమలు చేయాల్సి ఉంటుంది. ఈ మార్పులను ప్రభావవంతం చేయడానికి జూన్ 27 నుండి అమలులోకి వచ్చిన షేర్ బ్రోకర్లు, ఫ్రాడ్, పిఎఫ్‌యుటిపి ప్రమాణాలను సెబీ సవరించింది.