రాహుల్‌ నివాసం వద్ద భద్రత పెంపు

పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేగుతున్నది. ఆయన ప్రసంగంపై ఇప్పటికే పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో హిందూసంస్థలతో సంబంధాలున్న వ్యక్తులు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై దాడి చేసే అవకాశం ఉందని ఢిల్లీ పోలీస్‌ నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. 
 
ఈ నేపథ్యంలో హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు రాహుల్‌ గాంధీ, ఆయన నివాసం వద్ద భద్రతను పెంచారు. నివాసం వద్ద అదనంగా బలగాలను మోహరించారు. అదే ప్రాంతంలో నివసిస్తున్న కాంగ్రెస్‌ నేతలపై సైతం నిఘా వేశారు. కాంగ్రెస్‌ అగ్రనేత లోక్‌సభలో అధికార పక్షాన్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 
 
ఈ క్రమంలో రాహుల్‌పై పలువురు సంస్థల నాయకులు దాడి చేసే అవకాశం ఉందని ఢిల్లీ పోలీసులకు మంగళవారం అర్ధరాత్రి సమాచారం అందింది. ఆయనకు వ్యతిరేకంగా బ్యానర్స్‌, పోస్టర్లు వెలిసే అవకాశం ఉందని తెలిసింది. దాంతో రాహుల్‌ గాంధీ నివాసం వద్ద అదనంగా రెండు ప్లాటూన్ల బలగాలను మోహరించారు. ఒక్కో ప్లాటూన్‌లో 16 నుంచి 18 మంది పోలీసులు ఉంటారు. 
 
అంతే కాకుండా తుగ్లక్‌ రోడ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఎనిమిది నుంచి 20 మంది అదనపు పోలీసులను మోహరించారు. న్యూఢిల్లీ సరిహద్దులను మూసివేసి  క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే అనుమతి ఇస్తున్నారు. ఈ ప్రాంతంలో పెట్రోలింగ్‌ను సైతం పెంచారు. న్యూఢిల్లీ జిల్లా డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ దేవేష్ మహాలా సోమవారం రాత్రి జిల్లాలోని అన్ని ఏసీపీలు, పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జిలకు భద్రతను పెంచాలని ఆదేశాలు ఇచ్చారు. అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఇంటెలిజెన్స్ వ్యవస్థను పటిష్టం చేయాలని సూచించారు. 
 
హిందూ సంస్థలపై నిఘా పెట్టడమే కాకుండా భవిష్యత్ వ్యూహాలను ఆరా తీయాలని ఆదేశించినట్లు సమాచారం. రాహుల్‌ గాంధీ నివాసం దగ్గర, ఇతర ప్రాంతాల్లో ఎక్కడా ఎలాంటి పోస్టర్లు, బ్యానర్లు వేయకుండా చూడాలని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.