ప్రధాని మోదీతో టీమ్‌ ఇండియా క్రికెటర్ల భేటీ

టీమిండియా ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిన సమయంలో ఎంతో బాధలో ఉన్నప్లేయర్స్ ను ఓదార్చిన మోదీ  ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ గెలిచిన సంతోషంలో ఉన్న టీమ్ తో ఆనందాన్ని పంచుకున్నారు. వరల్డ్ కప్ ట్రోఫీతో ఫొటోలు దిగడంతోపాటు టీమ్ తో కాసేపు ముచ్చటించారు. టి20 ప్రపంచ కప్ ట్రోఫీతో గురువారం  ఉదయం న్యూఢిల్లీలో చేరుకున్న టీమిండియా.. ఆ తర్వాత కాసేపటికి ప్రధాని నరేంద్ర మోదీని ఆయన అధికారిక నివాసానికి వెళ్లి కలిసింది.

కెప్టెన్  రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తోపాటు మిగిలిన టీమ్ సభ్యులు, సపోర్ట్ స్టాఫ్ అందరూ మోదీని కలిశారు.  గతేడాది నవంబర్ 19న వన్డే వరల్డ్ కప్ ఓడిన సమయంలో ఎంతో బాధలో ఉన్నప్పుడు టీమ్ ను కలిసిన మోదీ మళ్లీ ఇప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉన్న టీమ్ తో సరదాగా గడిపారు. ప్రధానితో కలిసి క్రికెటర్లంతా అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా ప్రతి క్రికెటర్‌ను మోదీ ఆప్యాయంగా పలకరించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా మోదీకి బీసీసీఐ  ప్రత్యేక బహుమతి అందించింది. ‘నమో’ నెంబర్‌ 1 పేరున్న  ప్రత్యేక టీమ్‌ ఇండియా జెర్సీని అందజేసింది. భారత ఆటగాళ్ల సమక్షంలో బీసీసీఐ సెక్రటరీ జైషా, అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ ఈ జెర్సీసి మోదీకి బహుకరించారు.  ప్లేయర్స్, వరల్డ్ కప్ ట్రోఫీతో ఫొటోలు దిగిన మోదీ తర్వాత ప్లేయర్స్ అందరితో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా రోహిత్ తోపాటు మిగతా ప్లేయర్స్ అందరూ తమ వరల్డ్ కప్ విన్నింగ్ అనుభవాలను ప్రధానితో పంచుకున్నారు. ప్లేయర్స్ తోపాటు మోదీ కూడా ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా కనిపించారు.

ప్ర‌ధాని నివాసంలో అల్పాహారం, ఫొటో సెష‌న్ త‌ర్వాత విరాట్ కోహ్లీ  ప్రధాని మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపాడు. అల్పాహారం త‌ర్వాత ప్ర‌ధానికి షేక్ హ్యాండ్ ఇస్తూ దిగిన ఫొటోను విరాట్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాడు. ఆ ఫొటోకు ‘గౌర‌వ‌నీయులైన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ గారిని క‌ల‌వ‌డం నిజంగా గొప్ప గౌర‌వం. మ‌మ్మ‌ల్ని ప్ర‌ధాని నివాసానికి ఆహ్వానించినందుకు థ్యాంక్యూ స‌ర్’ అని క్యాప్ష‌న్ రాశాడు.