త్వరలో విమానం మాదిరిగా 132 సీట్ల బస్సు

132 సీట్ల సామర్థ్యంతో విమానంలో మాదిరిగా సదుపాయాలతో బస్సు రూపకల్పన జరుగుతోందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీవెల్లడించారు.  న్యూఢిల్లీలో జరిగిన ఓ జాతీయ మీడియా అవార్డుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొంటూ  నాగ్‌పూర్‌లో చేపట్టే ఈ పైలట్ ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయని, విమానం మాదిరిగా సీట్లు, ‘బస్ హోస్టెస్’ ఇందులో ఉంటారని తెలిపారు.

ప్రస్తుతం ఉన్న డీజీల్ వాహనాల కంటే చవకైన పర్యావరణహితమైన ఇంధనం సాయంతో ఈ బస్సును నడపనున్నామని కేంద్ర మంత్రి చెప్పారు.  దేశంలో కాలుష్యం ఒక పెద్ద సమస్యగా మారిందని, వ్యక్తిగత, ప్రజా రవాణాలో కాలుష్య రహిత వనరుల వినియోగాన్ని ప్రోత్సహించడంపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని గడ్కరీ తెలిపారు.  ‘దేశంలో ప్రస్తుతం ముఖ్యంగా ఢిల్లీలో ప్రధానమైన సమస్య కాలుష్యం.. గాలి, నీరు, ధ్వని అంతా కలుషితమైపోయాయి. దీనికి ప్రత్యామ్నాయ, తక్కువ ఖర్చుతో కూడిన, కాలుష్య రహిత, స్వదేశీ రవాణా పరిష్కారాలు అవసరం’ అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

`మన దగ్గర ఎలక్ట్రిక్ వాహనాలున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రస్తుతం 300 ఇథనాల్ ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. ఆటోమొబైల్ కంపెనీ పర్యావరణహిత వాహనాలను తయారుచేస్తున్నాయి. కాబట్టి లీటరకు రూ.120 ఖర్చయితే, ఇథనాల్‌కు అందులో సగం అంటే రూ.60 మాత్రమే అవుతుంది. 60 శాతం విద్యుత్, 40 శాతం ఇథనాల్‌తో వాహనాలు నడపనున్నాయి. దీని వల్ల కాలుష్యం తగ్గుతుంది’ అని మంత్రి వివరించారు.

దీంతో పాటు ప్రజా రవాణ వ్యయాన్ని కూడా తగ్గించడంపై దృష్టి సారించామని తెలిపారు. డీజిల్ బస్సు నడపడానికి కిలోమీటరకు రూ.115 ఖర్చయితే. రాయితీలతో కలిపి ఎలక్ట్రిక్ ఏసీ బస్సుకు రూ.41, నాన్-ఏసీకి రూ.37 ఖర్చవుతుంది. రాయితీలు లేకుంటే రూ.50 నుంచి రూ.60 వరకూ ఉంటుంది. దీని వల్ల ప్రజలపై కూడా టిక్కెట్ భారం 15 నుంచి 20 శాతం వరకూ తగ్గుతుందని గడ్కరీ తెలిపారు.

‘‘మేము టాటా సంస్థతో కలిసి నాగ్‌పూర్‌లో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాం. నేను చెక్ రిపబ్లిక్‌ పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ మూడు బస్సులు కలిపిన ట్రాలీ బస్సు ఉంది. మా ప్రాజెక్ట్ 132 మంది కూర్చునే సామర్థ్యం ఉంటుంది. రింగ్ రోడ్‌లో 49 కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తుంది. 40 కి.మీ తర్వాత బస్‌స్టాప్‌లో ఆగుతుంది.. కేవలం 40 సెకన్లలో తదుపరి 40 కి.మీకి ఛార్జ్ అవుతుంది. దీని కోసం కిలోమీటరుకు రూ. 35-40 ఖర్చు అవుతుంది.’’ అని గడ్కరీ తెలిపారు.

“సీట్ల ముందు ల్యాప్‌టాప్ పెట్టుకోడానికి స్థలం, సౌకర్యవంతమైన కుర్చీలు, ఎయిర్‌ కండిషన్ అవసరం అని నేను సూచించాను. ఎయిర్ హోస్టెస్‌ల మాదిరిగా ప్రయాణికులకు పండ్లు, ప్యాక్డ్ ఫుడ్, పానీయాలు అందజేయడానికి బస్ హోస్టెస్‌లు ఉండాలి. నా లెక్క ఇది. డీజిల్ బస్సు కంటే 30 శాతం తక్కువ ఖర్చు అవుతుంది. సౌరశక్తిని ఉపయోగిస్తే, ఖర్చు మరింత తగ్గుతుంది’’ అని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు.