ఢిల్లీలో రోహిత్‌ సేనకు ఘనస్వాగతం

టీ20 ప్రపంచకప్‌ సాధించి దశాబ్దాల కలను నెరవేర్చిన రోహిత్‌ సేనభారత్‌కు చేరుకుంది. గురువారం ఉదయం టీమ్‌ఇండియా సభ్యుల ప్రత్యేక విమానం ఢిల్లీలో దిగింది. 17 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీ20 ప్రపంచకప్‌తో స్వదేశంలో అడుగుపెట్టిన టీమ్‌ఇండియాకు అభిమానులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.

13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమ్‌ఇండియాకు స్వదేశంలో అభిమానులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. టీమ్‌ఇండియాకు స్వాగతం పలికేందుకు అభిమానులు గురువారం వేకువజామునే పెద్ద ఎత్తున విమానాశ్రయ పరిసరాలకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేయటంతో ఆటగాళ్లను దూరం నుంచే చూడాల్సి వచ్చింది. దిల్లీలో వర్షం కురుస్తున్నప్పటికీ.. టీమ్‌ఇండియాకు శుభాకాంక్షలు తెలుపుతూ వందలాది మంది ప్లకార్డులను ప్రదర్శించారు. జాతీయ జెండాలతో వారికి స్వాగతం పలికారు.

అభిమానుల కేరింతల మధ్య ఆటగాళ్లు ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తూ చిరునవ్వులు చిందించారు. ఫైనల్‌లో డేవిడ్‌ మిల్లర్‌ క్యాచ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పిన సూర్యకుమార్‌ యాదవ్‌ అభిమానుల కేరింతలకు ఉత్సాహంగా స్పందించాడు. వికెట్‌కీపర్‌ రిషభ్‌ పంత్‌ జన సమూహానికి సెల్యూట్ చేయగా.. పేసర్‌ సిరాజ్‌ ఫ్లయింగ్‌ కిస్సెస్‌ ఇచ్చాడు. చివరగా వచ్చిన రోహిత్ తన చేతిలో ఉన్న కప్పు అభిమానులకు చూపుతూ బస్సు ఎక్కాడు. విరాట్‌ అభివాదం చేస్తూ ముందుకు కదిలాడు

బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, కార్యదర్శి జైషా, మీడియా కూడా అదే విమానంలో స్వదేశం చేరుకున్నారు. ఆటగాళ్ల రాకతో ఢిల్లీ ఎయిర్ పోర్ట్​ ఫ్యాన్స్​తో కిక్కిరిసిపోయింది. ‘భారత్ మాతా కీ జై’, ‘ఇండియా ఇండియా’ నినాదాలతో అభిమానులు హోరెత్తించారు.  ఇక బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో ప్లేయర్లంతా డిల్లీ ఐటీసీ మౌర్య హోటల్​కు వెళ్లారు.

అక్కడ హోటల్ సిబ్బంది ప్లేయర్లకు ఘనస్వాగతం పలికారు. చాక్లెట్ ఫ్లేవర్​​తో వరల్డ్​కప్​ ట్రోఫీ డిజైన్​లో ప్రత్యేకంగా కేక్ తయారు చేశారు. ఆటగాళ్లకు స్పెషల్ బ్రేక్​ఫాస్ట్ ​కూడా సిద్ధం చేసినట్లు హోటల్ చీఫ్ చెఫ్ చెప్పారు.  ఉదయం 11 గంటలకు రోహిత్‌ సేన ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఆటగాళ్లు, కోచింగ్‌ సిబ్బందితో మోదీ అల్పాహార విందు చేయనున్నారు. అనంతరం ప్రత్యేక విమానంలో ముంబైకి బయల్దేరుతుంది. అక్కడ సాయంత్రం 5 గంటలకు ఓపెన్‌టాప్‌ బస్సులో రోడ్‌ షో నిర్వహించనున్నారు. 

కాగా, ప్రపంచకప్‌ ముగిసి ఐదు రోజులు గడిచినా భారీ తుఫాను కారణంగా బార్బడోస్‌లోనే ఆగిన టీమ్‌ఇండియా ఎట్టకేలకు బుధవారం సాయంత్రం స్థానిక గ్రాంట్లీ ఆడమ్స్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బీసీసీఐ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ‘ఎయిరిండియా చాంపియన్స్‌ 24 వరల్డ్‌ కప్‌’ అనే ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరింది.

మోదీతో అల్పాహారం తర్వాత మధ్యాహ్నం ఢిల్లీ నుంచి నేరుగా ముంబైకి వెళ్లనున్న భారత జట్టు సాయంత్రం విజయోత్సవ ర్యాలీలో పాల్గొననుంది. ముంబైలోని ప్రఖ్యాత నారీమన్‌ పాయింట్‌ నుంచి వాంఖడే స్టేడియం దాకా (సుమారు రెండు కిలోమీటర్లు) ఓపెన్‌ బస్‌లో ప్రపంచకప్‌ వీరులు విక్టరీ పరేడ్‌లో పాల్గొంటారు. 

ఇదే విషయమై బీసీసీఐ కార్యదర్శి జై షా ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. ‘ప్రపంచకప్‌ గెలిచిన టీమ్‌ఇండియాను గౌరవించుకునేందుకు విజయోత్సవ ర్యాలీలో భారీగా పాల్గొనండి’ అని ట్వీట్‌ చేశాడు. ‘ఈ ఆనంద క్షణాలను మేము మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాం. మెరైన్‌ డ్రైవ్‌ నుంచి మొదలుకాబోయే విక్టరీ పరేడ్‌లో కలుద్దాం’ అంటూ రోహిత్‌ శర్మ ట్వీట్‌ చేశాడు. 

ర్యాలీ ముగిశాక బీసీసీఐ ఆధ్వర్యంలో వాంఖడేలో ఆటగాళ్లకు, కోచింగ్‌ సిబ్బందికి చిరు సత్కారం ఏర్పాటు చేసింది. బీసీసీఐ ప్రకటించిన రూ. 125 కోట్ల ప్రైజ్‌మనీనీ ఇక్కడే అందజేసే అవకాశమున్నట్టు సమచారం.