హామీల అమలుపై కాంగ్రెస్ నేతల కాలయాపన

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా మాట్లాడారని, కానీ ఇప్పుడు దాటవేత ధోరణి అవలంబిస్తున్నారని మెదక్ బీజేపీ ఎంపీ ఎం రఘునందన్ రావు విమర్శించారు. హామీల అమలుపై కాంగ్రెస్ నేతలు కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్నా హామీలను అమలు చేయడంలేదని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన వరంగల్ రైతు డిక్లరేషన్ లోని  అభయహస్తంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, ఎకరాకు రూ.15వేల రైతు భరోసా, కౌలు రైతులకు రూ.12వేలు, మూతపడిన చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించడం, పంటల భీమా, అన్ని పంటలకు మెరుగైన గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పారని రఘునందన్ రావు గుర్తు చేశారు.

రైతు కమీషన్, కొత్త వ్యవసాయ విధానం ఏర్పాటు చేస్తామని , వరి పంటకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పారని ఆయన తెలిపారు. తమ నేత సోనియా గాంధీ జన్మదినమైన డిసెంబర్ 9వ తేదీనే రుణమాఫీ చేస్తామని ఆరోజు చెప్పారని, కానీ అది పోయిందని తెలిపారు. ఆ తర్వాత ఆగస్టు 15 అన్నారని, ఇప్పుడేమో కమిటీ వేసి ఎవరికి ఇవ్వాలో, ఎవరికి ఇవ్వకూడదో పరిశీలిస్తామని చెబుతున్నారని మండిపడ్డారు.

భూమి ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని ఆయన స్పష్టం చేశారు. అధికారం కోసం మోసపూరిత హామీలు ఇచ్చారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు మేనిఫెస్టో మీద కూడా గౌరవం లేదని ధ్వజమెత్తారు. అభయహస్తం మేనిఫెస్టోలో వరి ధాన్యానికి రూ.2683 రూపాయల మద్ధతు ధర ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు.

ఖమ్మం జిల్లాలో ఒక రైతు తన భూమిని కొందరు కాంగ్రెస్ నాయకులు కబ్జా చేస్తున్నారని ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం అని బిజెపి ఎంపీ చెప్పారు.  ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేలుకొని తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

రైతుల కష్టాలు పట్టించుకోకుండా కాంగ్రెస్ నాయకులు కాలయాపన  చేస్తున్నారని, రేవంత్‌రెడ్డి అడుగులు తడబడుతున్నాయని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేనాటికి మరో 15 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోలేని పరిస్థితిలో భారత రాష్ట్ర సమితి ఉందని విమర్శించారు. ఐదు రోజులు ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజకీయాలు తప్ప అభివృద్ధి కోసం ఆలోచించడంలేదని రఘునందనరావు ధ్వజమెత్తారు.