ఆర్థిక సంక్షోభం నుండి ఆదుకోమని ప్రధానిని కోరిన చంద్రబాబు

ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఢిల్లీకి అధికార పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా, కీలకమైన కేంద్ర మంత్రులను కలిసి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఆర్ధికంగా విధ్వంసంకు గురైన ఆంధ్ర ప్రదేశ్ అభివృధ్ధికోసం ఉదారంగా ఆర్ధిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో సుమారు అరగంట సేపు ఏకాంతంగా జరిపిన భేటీలోరాష్ట్రానికి ఆర్థిక సాయం, పోల‌వ‌రం ప్రాజెక్ట్ స‌వ‌రించిన అంచ‌నాల‌కు ఆమోదం, అలాగే పోల‌వ‌రం నిర్మాణానికి నిధులు, పెండింగ్‌లో ఉన్న విభ‌జ‌న హామీల ప‌రిష్కారం అంశాల‌ను చంద్ర‌బాబు లేవ‌నెత్తారు. రాష్ట్రాభివృద్ధికి ఎక్కువ స‌హ‌కారం అందించాల‌ని కోరారు. అలాగే తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బ‌కాయిల‌ను విడుద‌ల‌ అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం.

గతంలో టిడిపి ప్రభుత్వం ఉన్నప్పటి నుండి పోలవరం సవరించిన అంచనాలు కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయి. అదేవిధంగా రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయినా తెలుగు రాష్ట్రాల మధ్య పలు అంశాలు ఇంకా పరిష్కారంపై నోచుకోలేదు.  రాష్ట్రానికి ఆర్థికసాయం సహా రాష్ట్ర పునర్‌ నిర్మాణానికి అవసరమైన సహకారంపై చర్చించారు.

గత ప్రభుత్వ విధ్వంసంతో రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రధానమంత్రికి నివేదించారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ఆర్థికసాయం కోరారు. మౌలిక వసతుల కల్పన, అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తిచేయడానికి తోడ్పాటు అదించాలని కోరారు. అనంతపురం – అమరావతి ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం, కీలక రహదారుల మరమ్మతులు, పట్టణ, గ్రామీణ పేదల ఇళ్లు, జల్‌జీవన్‌ మిషన్‌ కింద ఇంటింటికీ తాగునీటి సరఫరా వంటి ముఖ్యమైన అంశాలపై ప్రధానమంత్రి ముందుచ్చారు.

“ఆంధ్రప్రదేశ్ సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను ప్రస్తావించడానికి ఈ రోజు, నేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఢిల్లీలో నిర్మాణాత్మక సమావేశాన్ని నిర్వహించాను. ఆయన నాయకత్వంలో, మన రాష్ట్రం రాష్ట్రాలలో పవర్‌హౌస్‌గా పునరుత్థానం అవుతుందని నేను విశ్వసిస్తున్నాను” అంటూ ప్రధానిని కలిసిన అనంతరం చంద్రబాబు నాయుడు ఎక్స్ లో పేర్కొన్నారు.

ఈ నెల చివరి వారంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న వేళ రాష్ట్ర అవసరాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌, ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీలను కూడా కలిశారు.  చంద్రబాబు సహా కేంద్రమంత్రులు రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్‌రెడ్డి, రాష్ట్ర ఎంపీలు,  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌, ఇతర ఉన్నతాధికారులకు పీయూష్ గోయల్‌ అల్పాహార విందు ఇచ్చారు.

విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డుకు నితిన్ గడ్కరీ అనుమతి ఇచ్చినట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్  వెల్లడించారు. రాజధాని అవుటర్ రింగ్ రోడ్డు సహా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నిడమానూరు వరకు ఫ్లైఓవర్ ఏర్పాటుకు కేంద్ర మంత్రి పచ్చజెండా ఊపినట్లు ఎంపీ చెప్పారు