బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ మహిపాల్ లాకర్లలో `బినామీ పత్రాలు’

పటాన్ చెరు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ గూడెం మహిపాల్ రెడ్డిపై ఇడి కేసు విచారణ ముమ్మరం చేసింది. మంగళవారం మహిపాల్ రెడ్డిని విచారించిన ఇడి అధికారులు బుధవారం మహిపాల్ రెడ్డి బ్యాంక్ అకౌంట్లపై దృష్టి పెట్టారు. పటాన్ చెరులోని యాక్సిస్ బ్యాంక్ లో మహిపాల్ రెడ్డి బ్యాంకు లాకర్లను ఇడి అధికారులు ఓపెన్ చేసి, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. 

బినామీల పేర్లతో ఉన్న పలు పత్రాలు లాకర్లలో ఉన్నట్లు గుర్తించిన ఇడి అధికారులు మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి బినామీలకు నోటీసులు ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలిసింది. మరో వైపు మహిపాల్ రెడ్డికి బినామీలుగా ఉన్నవారు ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం.

కాగా గత నెల 20న మహిపాల్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు, బంధువుల ఇళ్లలో ఇడి అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న అధికారులు విచారణకు రావాల్సిందిగా ఎంఎల్‌ఎకు నోటీసులు ఇచ్చారు. 

ఈ నేపథ్యంలో మంగళవారం ఇడి కార్యాలయంలో విచారణకు హాజరు కాగా ఆ మరుసటి రోజే బ్యాంకు లావాదేవీలు, లాకర్లపై ఇడి దృష్టి సారించడం సంచలనంగా మారింది.  పటాన్ చెరు పరిసర ప్రాంతాల్లో మహిపాల్ రెడ్డి సోదరులు మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. బినామీ పేర్లతో వ్యాపారాలు కొనసాగిస్తూ ప్రభుత్వానికి దాదాపు రూ. 300 కోట్ల వరకు నష్టం వాటిల్లేలా చేశారనే ఆరోపణలు వీరిపై ఉన్నాయి.

ఈడీ విచారణ మొత్తం కూడా, మహిపాల్ రెడ్డి చేసిన అక్రమ మైనింగ్ లో చేసిన 300 కోట్ల రూపాయలను ఎక్కడ పెట్టుబడి పెట్టాడు, ఆ పెట్టుబడులు ఎవరిపైన వున్నాయి అనేది తేల్చడమే లక్ష్యంగా సాగుతున్నాయిని తేటతెల్లం అవుతుంది. మహిపాల్ రెడ్డి సోదరునికి పఠాన్ చెరువు మండలంలోని లక్డారం గ్రామంలో సంతోష్ గ్రానైట్ కంపెనీ ఉన్నది, ఆ గ్రానైట్ కంపెనీ తమకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన దానికంటే ఎక్కువ భూమిలో తవ్వకాలు చేపట్టినట్టు మైనింగ్ డిపార్ట్మెంట్ విచారణ చేసి తేటతెల్లం చేసింది.

సంతోష్ గ్రానైట్ కంపెనీ మూడు వందల కోట్లకు విలువైన అక్రమ మైనింగ్ పాల్పడినట్టు తేల్చింది. అయితే, ఆ డబ్బులు ఎక్కడ పెట్టుబడి పెట్టారనేది మహిపాల్ రెడ్డి తమ అకౌంట్లలో చూపెట్టలేదు. అయితే, మహిపాల్ రెడ్డి మాత్రం తాము ఎలాంటి అక్రమ్ మైనింగ్ పాల్పడలేదని, ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలను వేధించడమే లక్షంగా అధికారలో ఉన్న పార్టీలు ఈ ఆరోపణలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.