హథ్రస్ క్షతగాత్రులకు సీఎం యోగి పరామర్శ

ధార్మిక సంబంధమైన కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన నేపపథ్యంలో హత్రాస్ జిల్లాలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారంనాడు పర్యటించారు. అక్కడి నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వైద్యులను పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. హత్రాస్ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా? ఇందులో కుట్ర కోణం ఉందా అనే విషయాన్ని నిర్ధారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణకు ఆదేశాలిచ్చారు.

హత్రాస్ ఘటనలో నిజానిజాలను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని యోగి ఆదిత్యానాథ్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇంతటి విషాద ఘటనను రాజకీయం చేయడం తగదని హితవు పలికారు. ప్రభుత్వం చాలా సున్నితమైన అంశంగా ఈ ఘటనను భావిస్తోందని చెప్పారు. 

ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా? కుట్ర కోణం ఉందా? అనే విషయాన్ని లోతుగా విచారణ జరుపుతామని, ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తొలుత పోలీసు అధికారులతో సమావేశమై పరిస్థితి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తుపై ఆరా తీశారు. ఘటన జరిగిన వివరాలను పోలీసులు వారికి వివరించారు. 

అనంతరం హాథ్రస్ ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఒక్కొక్కరి వద్దకు వెళ్లిన సీఎం యోగి, చికిత్స అందిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. బాధితుల కుటుంబ సభ్యులను కూడా ముఖ్యమంత్రి పరామర్శించారు. గాయపడిన వారు దాదాపుగా ప్రమాద స్థితి నుండి బయటపడ్డారని ఆయన తెలిపారు.

కాగా, హాథ్రస్​ ఘటనపై సమాజ్​వాదీ పార్టీ అధినేత, ఎంపీ అఖిలేశ్ యాదవ్ తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరమైన సంఘటన అని, దీనికి ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహిస్తుందని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి సరైన చిక్సిత అందక కొందరు మరణించారని విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగడం మొదటిసారి ఏమి కాదని పేర్కొంటూ మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అఖిలేశ్ యాదవ్ కోరారు.