మత మార్పిడీలతో మైనారిటీలు మెజారిటీలు అవుతారు

సామూహిక మత మార్పిడులను కొనసాగడానికి అనుమతించిన పక్షంలో ఒకరోజు దేశంలోని మైనారిటీ జనాభా మెజారిటీ జనాభాగా మారిపోతుందని అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఉత్తర్ ప్రదేశ్ చట్ట వ్యతిరేక మత మార్పిడుల నిషేధ చట్టం అరెస్టయిన కైలాష్ అనే నిందితుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ సింగిల్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

రాజ్యాంగంలోని 25 అధికరణలో మత స్వేచ్ఛను కల్పించారే తప్ప మత మార్పిడులను కాదని న్యాయమూర్తి జారీచేసిన తన ఉత్తర్వులలో పేర్కొన్నారు. మతాన్ని ప్రోత్సహించాలని రాజ్యాంగంలో పేర్కొన్నారని, దీనికి అర్థం ఒక వ్యక్తిని ఒక మతం నుంచి మరో మతానికి మార్చడం కాదని న్యాయమూర్తి చెప్పారు. 

ఈ కేసులో నిందితుడు ఢిల్లీలో జరిగిన ఒక మత సమ్మేళనానికి తమ గ్రామం నుంచి కొందరిని తీసుకువెళ్లి క్రైస్తవంలోకి మార్చినట్లు తీవ్రమైన ఆరోపణలు నమోదయ్యాయని న్యాయమూర్తి తెలిపారు. న్యూఢిల్లీలో జరిగే మత సమ్మేళనాలకు తమ గ్రామం నుంచి ప్రజలను తీసుకువెళుతున్న కైలాష్ అక్కడ వారిని క్రైస్తవంలోకి మార్చుతున్నట్లు దర్యాప్తులో తేలిందని న్యాయమూర్తి తెలిపారు. 

ఈ ప్రక్రియను ఇలాగే కొనసాగడానికి అనుమతి ఇస్తే ఏదో ఒకరోజు దేశంలోని మెజారిటీ జనాభా మైనారిటీగా మారిపోగలరని ఆయన చెప్పారు. మత మార్పిడుల కోసం జరిగే ఇటువంటి మత సమ్మేళనాలను వెంటనే నిలిపివేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.