మణిపూర్ లో అగ్నికి ఆజ్యం పోయడం ఆపండి

మణిపూర్ అంశంలో అగ్నికి ఆజ్యం పోయడం ఆపాలని విపక్షాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి కేంద్ర ప్రభుత్వం తరపున ఆయన బుధవారం సమాధానమిస్తూ మణిపూర్‌లో సామాజిక సంఘర్షణకు సుదీర్ఘ చరిత్ర ఉందని తెలిపారు. ఈ తరహా హింస 1993లో జరిగిందని,  ఐదేళ్లపాటు ఇలాంటి ఘటనలు నిరంతరం జరిగాయని గుర్తు చేశారు. 
 
మణిపూర్‌లో 10 సార్లు రాష్ట్రపతి పాలన విధించారని చెబుతూ మణిపూర్‌ను విపక్షాలు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నాయని ప్రధాని ఆరోపించారు. దేశ ప్రజలు వారి కుట్రలను తిరస్కరిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. మణిపూర్‌లో సాధారణ పరిస్థితిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని మోదీ తెలిపారు. సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోందని స్పష్టం చేశారు. 
 
ప్రస్తుతం మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టాయని ప్రధాని తెలిపారు. చిన్న రాష్ట్రంలో 11 వేలకు పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని, మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణ జరుగుతోందని మోదీ తెలిపారు. మణిపూర్‌లో పాఠశాలలు, కళాశాలలు తెరుచుకుంటున్నాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల మాదిరిగానే మణిపూర్‌లో కూడా సాధారణ పరీక్షలు జరిగాయని పేర్కొన్నారు.
 
 శాంతిభద్రతల పునరుద్ధరణ కోసం హోంమంత్రి మణిపూర్‌లోనే ఉంటూ తగిన చర్యలు తీసుకున్న విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. అక్కడ హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పడుతున్నాయని తెలిపారు. కాగా, అవినీతిపరులు చట్టాల నుంచి తప్పించుకోలేరని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. బినామీ ఆస్తులపై కొత్త చట్టం తీసుకొచ్చామని చెప్పారు. 
 
అవినీతిపరులను అణిచివేస్తామని 2014లోనే చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. అవినీతిపరులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతూ  దర్యాప్తు సంస్థలకు స్వేచ్ఛా నియంత్రణ కల్పించామని, అవినీతి చట్టాల నుంచి తప్పు చేసిన వారిని రక్షించలేమని.. ఇది మోదీ హామీ అంటూ తెలిపారు.  గత పదేళ్లలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ పనితీరును చూసే ప్రజలు మూడోసారి అధికారం ఇచ్చారని,  విపక్షాల అజెండాను ప్రజలు తిరస్కరించారని ప్రధాని  మోదీ స్పష్టం చేశారు. మోదీ ప్రసంగిస్తున్నప్పుడు నినాదాలు చేసిన విపక్ష సభ్యులు మధ్యలోనే సభ నుంచి వాకౌట్‌ చేశారు. 
 
అబద్ధాలను ప్రచారం చేస్తున్న వారు నిజాలను వినలేకపోతున్నారని ప్రతిపక్ష సభ్యులను ఉద్దేశించి మోదీ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఓడిన విపక్షాలు ఇప్పుడు నినాదాలు చేస్తూ పారిపోతున్నాయని ఎద్దేవా చేశారు. 140 కోట్ల మంది ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని ప్రధాని విమర్శించారు.

“స్వతంత్ర భారత చరిత్రలో, పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రయాణంలో అనేక దశాబ్దాల తర్వాత దేశ ప్రజలు ఒక ప్రభుత్వానికి వరుసగా మూడోసారి ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చారు. పదేళ్లు దేశాన్ని పాలించిన తర్వాత ఒక ప్రభుత్వం తిరిగి ఎన్నికవ్వడం 60 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 6 దశాబ్దాల తర్వాత జరిగిన ఈ ఘటన అసామాన్యమైనది. కొందరు ఉద్దేశపూర్వకంగా దేశ ప్రజలు తీసుకున్న ఈ మహత్తర నిర్ణయంపై మసిపూయాలని చూస్తున్నారు.” అంటూ మోదీ ప్రసంగించారు.

రాబోయే ఐదేండ్లలో పేదరికంపై పోరాటంలో విజయం సాధిస్తామని చెప్పారు. గత పదేండ్ల అనుభవాలతో తాను ఈ మాట చెబుతున్నానని పేర్కొంటూ భారత్ మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా అవతరించే నాటికి ఆ ప్రభావం అన్ని రంగాలపై ఉంటుందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా కాంగ్రెస్‌ తీరు మారలేదని ఎద్దేవా చేశారు. 
 
140 కోట్ల మంది ప్రజలను విపక్షాలు అవమానిస్తున్నాయని ప్రధాని విమర్శించారు. రాజ్యాంగం వల్లే తనలాంటి వారు పార్లమెంట్ వరకూ రాగలిగారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ హయాంలో రూ. 60,000 కోట్ల వరకూ రైతుల రుణాలు మాఫీ చేసినా లబ్ధిదారుల జాబితాలో చిన్న, సన్నకారు రైతుల పేర్లు చేర్చలేదని ఆరోపించారు.
 
ఢిల్లీ మద్యం కుంభకోణాన్ని మోదీ ప్రస్తావిస్తూ, ఆప్ స్కామ్‌లకు పాల్పడిందని, ఆ పార్టీని రక్షించేందుకు కాంగ్రెస్ కోర్టును ఆశ్రయించిందని మోదీ తెలిపారు. మద్యం కుంభకోణంపై కాంగ్రెస్ కోర్టును ఆశ్రయించిందని, కుంభకోణాలకు పాల్పడిన వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు.