జగన్నాధ రథయాత్రకు భారీ ఏర్పాట్లు

* రెండ్రోజులు సెలవు ప్రకటించిన ఒడిషా ప్రభుత్వం

పూరీ జగన్నాధ రథయాత్రకు చేపట్టిన భారీ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని ఒడిషా ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ వెల్లడించారు. రథయాత్ర సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులు సెలవు దినాలను సీఎం ప్రకటించారు. జులై 7న అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జగన్నాధ రథయాత్రకు విస్తృత ఏర్పాట్లు చేశామని, ఇవన్నీ ఓ కొలిక్కి వస్తున్నాయని వెల్లడించారు. 
 
ఏర్పాట్లపై తాను ఉన్నతాధికారులతో ఈరోజు అత్యున్నత స్ధాయి సమీక్ష సమావేశం నిర్వహించానని చెప్పారు.  రధయాత్రకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని సంబంధిత శాఖల అధికారులు తెలిపారని, ఉత్సవాలు అత్యంత భారీగా జరుగుతుండటంతో రాష్ట్రంలో రెండు రోజుల పాటు సెలవలు ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
 
రధయాత్ర వేడుకల్లో రాష్ట్రపతి పాల్గొనడం అసాధారణమని, ఈ ఏడాది రధయాత్రలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంసిద్ధత వ్యక్తం చేయడం తమకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఇక కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ యాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏటా ఆషాడ శుద్ధ తదియ రోజున జరిగే ఈ రథయాత్రను వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచీ భక్తులు తరలివస్తుంటారు. 
 
జులై 7న పూరీ జగన్నాథ స్వామి రథయాత్ర ఉత్సవం జరగనుండగా ఈసారి ఒకే రోజున నవయవ్వన వేడుక, నేత్రోత్సవం, ఘోషయాత్ర నేత్రపర్వంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పూరీ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ప్రత్యేకమైనది జగన్నాథ రథయాత్ర. దేశంలో పూరీ జగన్నాథ రథయాత్ర అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. 
 
ఈ ఉత్సవం ప్రతీ సంవత్సరం జూన్ లేదా జూలై నెలల్లో నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను పూరీ నగర వీధుల్లో ఊరేగిస్తారు. ఈ రథం దాదాపు 45 అడుగుల ఎత్తు, 35 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది. దీనికి ఏడు అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలు ఉంటాయి. 
 
దాదాపు నాలుగు వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు. నేత్రపర్వంగా సాగే ఈ ఉత్సవాన్ని వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు లక్షలాదిగా తరలి వస్తారు. ప్రతి యేటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఈ యాత్ర పూరీ నుండి గుండిచా దేవాలయం వరకు సాగుతుంది. ఈ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు 60 మంది కార్యనిర్వాహక మెజిస్ట్రేట్ లను నియమించారు. రథయాత్ర రోజున 5 నుండి 8 లక్షల మంది వరకు ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నారు.