
పీజీ వైద్యవిద్యా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్ – పోస్ట్ గ్రాడ్యుయేట్ (నీట్-పీజీ) 2024 పరీక్ష వచ్చేనెల రెండోవారంలో జరుగనున్నది. సవరించిన పరీక్షా తేదీని వారంలోపు ప్రకటిస్తామని మంగళవారం అధికార వర్గాలు తెలిపాయి. ఆరోగ్యశాఖ, జాతీయ వైద్యశాస్త్ర పరీక్షల మండలి (ఎన్బీఈఎంఎస్) అధికారులతో కేంద్ర హోంశాఖ అధికారులు సోమవారం సమావేశమయ్యారు.
నీట్- పీజీ 2024 ఎంట్రన్స్ ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో నీట్-పీజీ 2024 పరీక్ష నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై టెక్నికల్ పార్టనర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), సైబర్ సెల్ అధికారులు చర్చించారు. నీట్- పీజీ పరీక్ష తేదీతోపాటు ఈ నెల ఆరో తేదీన జరిగే విదేశీ వైద్యవిద్యా గ్రాడ్యుయేట్ల పరీక్ష నిర్వహణకు సమర్థవంతమైన వ్యవస్థ రూపకల్పనపై చర్చించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
సమర్ధవంతంగా పరీక్ష నిర్వహణకు అవసరమైన చర్యలపైనా చర్చించారు. ఈ సమావేశంలో పాల్గొన్న టీసీఎస్ ప్రధాన ఎగ్జిక్యూటివ్‌ల బృందం.. పరీక్ష నిర్వహణా పద్దతిలో వివిధ అంశాలను అధికారులకు వివరించినట్లు తెలుస్తున్నది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం గత నెల 23న నీట్-పీజీ పరీక్ష జరుగాల్సి ఉంది.
కానీ కాంపిటీటివ్ పరీక్షల సమగ్రతపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఒక రోజు ముందు గత నెల 22న `నీట్-పీజీ 2024` పరీక్షను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. నీట్ యూజీ 2024 పరీక్షలు అవకతవకలు జరిగాయని, ప్రశ్నాపత్రం లీకైందన్న ఆరోపణలతో విద్యార్థులు, విపక్షాలు ఆందోళనకు దిగాయి.
నీట్ యూజీ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. వివిధ రాష్ట్రాల హైకోర్టుల్లో ఈ విషయమై దాఖలైన పిటిషన్లను తమకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్