 
                కళాశాల క్యాంపస్ ఆవరణలో హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ ఇటీవలే తరచూ వార్తల్లో నిలిచిన ముంబైలోని ఓ ప్రముఖ కళాశాల తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు కళాశాలకు టీషర్ట్స్, చిరిగిన జీన్స్ తో రావడాన్ని నిషేధించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.  ఇటీవలే కళాశాల ఆవరణలో విద్యార్థులు హిజాబ్ ధరించడాన్ని నిషేధించిన చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషనల్ సొసైటీ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. 
కళాశాలకు వచ్చే విద్యార్థులు సాంస్కృతిక అసమానతల్ని సూచించే దుస్తులతో రావొద్దని ఆదేశించింది.  ముంబైలో ఈ సొసైటీ నిర్వహిస్తోన్న ఎన్‌జీ ఆచార్య, డీకే మరాఠే కళాశాలల్లో చిరిగిన జీన్స్, టీషర్టులు, జెర్సీలతో వస్తే విద్యార్థులను అనుమతించబోమని స్పష్టం చేసింది. విద్యార్థులు తప్పనిసరిగా ఫార్మల్, డీసెంట్ దుస్తుల్లో మాత్రమే కళాశాలకు రావాలని ఆదేశించింది.
‘విద్యార్థులు క్యాంపస్‌లో ఉన్నప్పుడు ఫార్మల్, డీసెంట్ దుస్తులు ధరించాలి. వారు హాఫ్ షర్ట్ లేదా ఫుల్ షర్ట్ , ప్యాంటు ధరించవచ్చు. అమ్మాయిలు భారతీయ లేదా పాశ్చాత్య దుస్తులను ధరించవచ్చు. విద్యార్థులు మతాన్ని లేదా సాంస్కృతిక అసమానతలను చూపించే ఎలాంటి దుస్తులూ ధరించకూడదు. జీన్స్, టీషర్టులు, రివీలింగ్ డ్రెస్సులు, జెర్సీలు ధరించి వస్తే అనుమతించబోము’ అని నోటీసుల్లో పేర్కొంది. ఈ నోటీసును కళాశాల గేటుకు అంటించింది.





More Stories
2,790 మంది భారతీయులను వెనక్కి పంపిన అమెరికా
కాంకేర్ జిల్లాలో మరో 21 మంది మావోయిస్టుల లొంగుబాటు
దేశవ్యాప్తంగా 22 నకిలీ యూనివర్సిటీలు