విభజన అంశాలపై 6న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ

పదేళ్లు గడిచినా ఇంకా తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజనకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. రెండు ప్రభుత్వాలు కలిసి పరస్పర అవగాహనతో ఈ సమస్యలను పరిష్కరించుకునేందుకు చొరవ చూపారు. ఈ విషయమై ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ వ్రాసారు.
 
రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలు, ఇతర విషయాలపై చర్చించేందుకు భేటీ అవుదామని సీఎం చంద్రబాబు ఆ లేఖలో ప్రతిపాదించారు. రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం, ఇరు రాష్ట్రాల పురోగతి, రాష్ట్రాల మధ్య పరస్పర సహకారంపై సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసేందుకు తాను ఎదురుచూస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో సమావేశం కావాలని ప్రతిపాదించారు. ఇందుకు రేవంత్‌ కూడా అంగీకరించారు.
 
ఈ సమావేశానికి ముఖ్యమంత్రులతోపాటు రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరు చొప్పున సీనియర్‌ మంత్రులు, సంబంధిత అంశాలకు సంబంధించిన సీనియర్‌ అధికారులు కూడా హాజరవుతారు. ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విభజన చట్టంలో పేర్కొన్న కొన్ని అంశాలు రెండు రాష్ట్రాల మధ్య ఇంకా అపరిష్కృతంగా ఉండిపోయాయి. ఉమ్మడి సంస్థల మధ్య ఆస్తుల విభజన కూడా పూర్తికాలేదు. ఈ నేపథ్యంలోనే రేవంత్‌తో భేటీకి చంద్రబాబు సిద్ధమయ్యారు.
 
“తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరు చేపట్టిన విశేషమైన కార్యక్రమాలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అంకితభావం, నాయకత్వం తెలంగాణ రాష్ట్ర ప్రగతికి, అభివృద్ధికి గణనీయంగా తోడ్పడ్డాయి.తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రెండింటికీ సుస్థిరమైన పురోగతి కోసం సన్నిహిత సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది” అంటూ తన లేఖలో చంద్రబాబు తెలిపారు. 
 
“ఇరు రాష్ట్రాల అభివృద్ధికి, పరస్పర లక్ష్యాలను సాధించడంలో పరస్పర సహకారం కీలకమైనది. ఆంధ్ర ప్రదేశ్ విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయ్యాయి. పునర్వ్యవస్థీకరణ చట్టం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యల గురించి అనేక చర్చలు జరిగాయి. ఈ సమస్యల పరిష్కారం మన రాష్ట్రాల సంక్షేమం, పురోగతిపై గణనీయమైన ప్రభావాలను చూపుతాయి. ఈ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడం అత్యవసరం. ఈ నేపథ్యంలో జులై 6వ తేదీ శనివారం మధ్యాహ్నం మీ ప్రాంతంలో కలుసుకోవాలని నేను ప్రతిపాదిస్తున్నాను” అంటూ తన ప్రతిపాదనను రేవంత్ ముందు ఉంచారు. 
 
“ఈ సమావేశం క్లిష్టమైన సమస్యలపై సమగ్రంగా చర్చించడానికి సహాయపడుతుందని భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పరస్పర ప్రయోజనకరమైన పరిష్కారాలను సాధించడంలో సమర్థవంతంగా సహకరించడానికి మనకు అవకాశాన్ని కల్పిస్తుందని దృఢంగా విశ్వసిస్తున్నాను. ఈ చర్చలు ఫలితాలు ఇస్తాయని నాకు నమ్మకం ఉంది”  అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.
 
ఈ భేటీకి ముందు చంద్రబాబు రెండు రోజులపాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఆ సమయంలో ఈ అపరిష్కృత సమస్యల గురించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకురానున్నారు. దాని కొనసాగింపుగా రేవంత్‌తో ఆయా అంశాలపై చర్చిస్తారు. జగన్‌, కేసీఆర్‌ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఒకసారి సమావేశమైనా… అది వారిద్దరి వ్యక్తిగత భేటీగానే జరిగింది. ఏ అంశమూ పరిష్కారం కాలేదు. ఈసారి ఇటు చంద్రబాబు, అటు రేవంత్‌ ఇద్దరూ సానుకూల దృక్పథంతో ఉండటంతో… విభజన అంశాల పరిష్కారంలో ముందడుగు పడే అవకాశముందని అంటున్నారు.  ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. దీంతో ఇప్పటికైనా విభజన సమస్యలు ఓ కొలిక్కి రావాలని రెండు రాస్త్రాల ప్రజలు కోరుకొంటున్నారు.