రాహుల్ ప్రసంగంపై రసభ… మండిపడ్డ మోదీ, అమిత్ షా, నిర్మలా

ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లను ఉద్దేశించి ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు లోక్‌సభలో గందరగోళం సృష్టించాయి. రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా సహా బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 
 
సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో జరిగిన చర్చలో రాహుల్‌ గాంధీ మొదటిసారిగా ప్రతిపక్ష నేత హోదాలో ప్రసంగిస్తూ పరమశివుడి చిత్రపటాన్ని చూపిస్తూ.. ‘హిందువులు ఎప్పుడూ భయాన్ని, విద్వేషాన్ని వ్యాప్తి చేయరు. కానీ, హిందువులుగా చెప్పుకునే కొందరు మాత్రం కేవలం హింస, విద్వేషం, అసత్యమే మాట్లాడతారు. మీరు హిందువులే కాదు’ అంటూ బీజేపీ సభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 
 
ఈ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు లేచి నిలబడి అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో మతపరమైన చిత్రాలను చూపించవద్దంటూ స్పీకర్‌ ఓం బిర్లా కూడా రాహుల్‌ను నిలువరించే ప్రయత్నం చేశారు. రాహుల్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా లోక్‌సభ స్పీకర్‌ను బీజేపీ కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.
 
రాహుల్‌ గాంధీ వ్యాఖ్యల పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర అభ్యంతరం తెలిపారు. యావత్‌ హిందూ సమాజాన్ని హింసాత్మకమైనదిగా పేర్కొనడం చాలా తీవ్రమైన అంశమని ఆయన పేర్కొన్నారు. అయితే, తాను బీజేపీ గురించి మాట్లాడుతున్నానని, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, మోదీ అంటే మొత్తం హిందూ సమాజం కాదని రాహుల్‌ గాంధీ స్పష్టత ఇచ్చారు. 
 
హోంమంత్రి అమిత్‌ షా స్పందిస్తూ హిందువులుగా గుర్తింపు పొందేందుకు గర్వపడుతున్న కోట్లాది మంది ప్రజల మనోభావాలను గాయపరిచినందుకు రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎమర్జెన్సీ, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లను ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్‌ పార్టీ దేశమంతా భయోత్పాతాన్ని వ్యాప్తి చేసిందని, రాహుల్‌ గాంధీకి అసలు అహింసపై మాట్లాడే హక్కు లేదని అమిత్‌ షా పేర్కొన్నారు.  కోట్లాది మంది ప్రజలు తాము హిందువులమని గర్వంగా చెప్పుకుంటారనే విషయం రాహుల్‌కు తెలియదని ధ్వజమెత్తారు.  ఏ మతాన్ని హింసతో ముడిపెట్టడం తప్పని అమిత్ షా హితవు పలికారు.
 
హిందువుల పట్ల ద్వేషంతో ప్రారంభమైన రాహుల్ గాంధీ బుజ్జగింపు రాజకీయాలు హిందువుల పట్ల ద్వేషంతో ముగుస్తాయని  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. విపక్ష కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ ఆయన బాటనే అనుసరిస్తాయని ఆమె ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై నిర్మలా సీతారామన్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘తనను తాను హిందువుగా చెప్పుకుంటున్న విపక్ష నేత రాహుల్ గాంధీ.. హిందువులంతా ద్వేషం, ధిక్కార స్వభావం కలిగి ఉంటారని చెబుతున్నారు. హిందువుల పట్ల ఆయన కపటత్వం బయట పడింది` అని ఆమె  విమర్శించారు. 

‘రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలపై ప్రధాని మాత్రమే స్పందించే హక్కు ఉంది. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలు హిందువుల పట్ల ద్వేషంతో మొదలై ద్వేషంతోనే ముగుస్తాయి. ఆయన బాటనే ఇండియా కూటమి నేతలు అనుసరిస్తారంటే ఆశ్చర్యమేమీ లేదు’ అని మరో ‘ఎక్స్’ పోస్టులో నిర్మలా సీతారామన్ తెలిపారు.

రాహుల్‌ గాంధీ విపక్ష నేతగా తొలిసారి ఈ బాధ్యతలను చేపట్టారని, కానీ ఇవాళ ఆయన బాధ్యతారాహిత్య ప్రకటన చేశారని  కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ విమర్శించారు. అమర వీరులకు ఎలాంటి పరిహారం చెల్లించడం లేదని ఆయన అసత్యాలు వల్లె వేశారని అన్నారు. ఇంతకంటే మరో పెద్ద అబద్ధం ఏదీ ఉండదని పేర్కొన్నారు. అమరవీరులకు రూ. కోటి పరిహారం అందిస్తున్నామని రక్షణ మంత్రి స్వయంగా సభలో వివరణ ఇచ్చారని గుర్తు చేశారు.

రాహుల్ మాంచి స్టాండప్‌ కమెడియన్‌

లోక్‌సభలో రాహుల్‌గాంధీ ప్రసంగించిన తీరు మాంచి స్టాండప్‌ కమెడియన్‌ను తలపించిందని  బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్‌ ఎద్దేవాచేశారు. ఆయన దేవుళ్లు, దేవతలను కూడా కాంగ్రెస్‌ పార్టీకి బ్రాండ్‌ అంబాసిడర్‌లుగా మార్చేశాడని మండిపడ్డారు. ఆఖరి పరమశివుడి అభయ హస్తాన్ని కూడా కాంగ్రెస్‌ పార్టీ హస్తమే అని ఆయన చెప్పడం హాస్యాస్పదంగా అనిపించిందని ఆమె విమర్శించారు.

‘రాహుల్ గాంధీ మాంచి స్టాండప్‌ కమెడియన్‌. ఈ విషయాన్ని నేను ఇంతకుముందే చెప్పాను. ఆయన దేవుళ్లు, దేవతలు అందరినీ కాంగ్రెస్‌ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్‌లుగా మార్చేశారు. ఆఖరికి పరమశివుడి అభయ హస్తం కూడా కాంగ్రెస్‌ పార్టీ హస్తమే అని ఆయన చెప్పడం హాస్యాస్పదం’ అని కంగనా ఎద్దేవా చేశారు.  ‘ఇవీ ఆయన మాటలు. ఇది ఆయన ప్రసంగం. అందుకు మేం ఇప్పటికే నవ్వుకుంటున్నాం. అయితే ఈ వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్‌గాంధీ క్షమాపణలు చెప్పాలి’ అని ఆమె డిమాండ్‌ చేశారు.

రాహుల్‌ సోమవారం లోక్‌సభలో డ్రామా సృష్టించాలని అనుకున్నారని, కానీ అది ఎలా చేయాలో ఆయనకు తెలియలేదని బీజేపీ ఎంపీ అరుణ్‌ గోవిల్‌ ఎద్దేవా చేశారు. డ్రామా అంటే కంటెంట్‌ను అర్ధం చేసుకోవడం కీలకమని చెప్పారు. రాహుల్‌ ఎదగలేదని, ఆయన ఇంకా పరిణితి చెందాల్సి ఉందని చెబుతూ ఇలాంటి విపక్ష నేతను చూడటం చికాకుగా ఉందని పేర్కొన్నారు.

అయితే, ఇక విపక్ష నేత, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ లోక్‌సభ ప్రసంగంలో ఎక్కడా హిందువులను అవమానించలేదని రాహుల్ సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి  ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. తాను బీజేపీతో పాటు ఆ పార్టీ నేతల తీరు గురించే మాట్లాడానని రాహుల్‌ స్పష్టంగా చెప్పారని ఆమె గుర్తు చేశారు.

రహుల్‌గాంధీ చేసిన ప్రసంగాన్ని శిరోమణి అకాలీదళ్‌ ఎంపీ హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ మెచ్చుకున్నారు. ఆయన (రాహుల్‌ గాంధీ) చెప్పదల్చుకున్నదని కరెక్టుగా చెప్పారని ఆమె కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం రైతుల డిమాండ్‌లను ఇప్పటికీ నెరవేర్చలేదని విమర్శించారు. తమకు న్యాయం చేయాలని పోరాడుతూ ఎంతో మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని, వారికి కనీసం నష్టపరిహారం కూడా చెల్లించలేదని హర్‌సిమ్రత్‌ మండిపడ్డారు.