యుపి సత్సంగ్ తొక్కిసలాటలో 100 మంది మృతి!

ఉత్తర్​ప్రదేశ్​లోని హత్రస్​ జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ సత్సంగ్​ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 100 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది.  అందులో మహిళలు, పిల్లులు కూడా ఉన్నారు. అనేక మంది గాయపడ్డారు. రతిభాన్పూర్‌లో ఏర్పాటు చేసిన ఓ శివారాధన కార్యక్రమంలో ఈ విషాదం జరిగింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

రతీభాన్‌పూర్‌లో పరమశివుడికి సంబంధించి ముగింపు ఉత్సవాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ ముగింపు ఉత్సవాలకు ఆ యా పరిసర గ్రామాల నుంచి భారీగా భక్తులు పోటెత్తారు. ఆ క్రమంలో ఈ తొక్కిసలాట జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఎటా మెడికల్‌ కాలేజీకి తరలించారు.

ఇదొక ప్రైవేటు కార్యక్రమం అని, దీని నిర్వహణకు ఎస్​డీఎమ్​ అనుమతి ఇచ్చారని సమాచారం. మరోవైపు, ఈ ఘటనపై స్పందించిన జిల్లా మేజిస్ట్రేట్​ ఆశిష్​ కుమార్, సత్సంగ్​ అయిపోయిన తర్వాత, బయటకు వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. దీనిపై జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

మరోవైపు, సహాయక చర్యలను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ స్వయంగా పరిశీలిస్తున్నారు. సహాయక చర్యలు వేగవంతం చేయడానికి ఇద్దరు మంత్రులు, చీఫ్​ సెక్రటరీ, డీపీపీని ఘటనాస్థలికి పంపారు. వీరంతా ప్రత్యేక విమానంలో హత్రాస్​కు చేరుకుంటున్నారు. అంతేకాకుండా ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని హోం శాఖ అదనపు కార్యదర్శి దీపక్​ కుమార్​ను సీఎం ఆదేశించారు. 
హత్రాస్ తొక్కిసలాటలో పెద్ద సంఖ్యలో భక్తులు మరణించిన ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు ఆమె తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్టుపెట్టారు.
హత్రాస్​ జిల్లాలో జరిగిన ప్రమాదంపై యోగి ఆదిత్యనాథ్​ దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోలవాలని ఆకాంక్షించారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించాలని, ఘటనాస్థలిలో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని జిల్లా యంత్రంగాన్ని ఆదేశించారు. ఈ ఘటనకు కారణాలపై దర్యాప్తు చేయాలని ఆగ్రా ఏడీజీని యోగి ఆదేశించారు. ఈ ఘటనపై  రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తదితరులు సహితం దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.