కవితకు బెయిల్‌ను నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు

మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ నిరాకరించింది. సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై సుదీర్ఘంగా విచారించిన కోర్టు మే 28న తీర్పు రిజర్వ్‌ చేసిన విషయం తెలిసిందే.  రెండు కేసుల్లోనూ బెయిల్‌ను నిరాకరిస్తూ తుది తీర్పును వెలువరించింది.
 
ఈ కేసులో సుమారు 100 రోజులకుపైగానే జైలులో ఉంటున్న కవితకు బెయిల్ రావటం కష్టంగా మారింది. ఇప్పటికే కవితకు బెయిల్ ఇచ్చేందుకు రౌస్ ఎవెన్యూ కోర్టు నిరాకరించగా, ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో కూడా చుక్కెదురైంది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ కవితకు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. దీంతో.. ఆమెకు బెయిల్ రావటం మరింత క్లిష్టంగా మారింది.
 
మహిళ కావడంతో బెయిల్‌ మంజూరు చేసే అంశాన్ని పరిశీలించాలని న్యాయవాది కోరారు. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ బెయిల్‌ను సీబీఐ, ఈడీ వ్యతిరేకించాయి. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మార్చి 15న కవితను బంజారాహిల్స్‌లోని నివాసంలో ఈడీ అధికారులు ఆమెను అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టులో అధికారులు హాజరుపరిచారు. 
 
అనంతరం ఈడీ విజ్ఞప్తి మేరకు ఈడీ కస్టడీకి ఇచ్చింది. ఈడీ విచారణ ముగియడంతో కోర్టు జ్యుడీషియల్‌ కస్టడీకి ఇచ్చింది. ఇదే కేసులో కవితను ఏప్రిల్‌ 11న సీబీఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీపై తిహార్‌ జైలులో ఉన్నారు. తనకు బెయిల్ ఇవ్వాలని త్వరలో ఆమె సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది.
 
మరోవైపు కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. కవిత కస్టడీ జూన్ 21వ తేదీతో ముగియగా, ఈడీ అధికారులు ఆమెను వర్చువల్‌గా కోర్టు ముందు హాజరు పరిచారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. కవిత జ్యుడీషియల్ కస్టడీని జులై 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు వెలువరించారు.