మంత్రి భార్య దురుసు ప్రవర్తనపై చంద్రబాబు ఆగ్రహం

ఆమె మంత్రి లేదా చట్టసభ సభ్యురాలు కాదు. కనీసం ప్రజా ప్రతినిధి కూడా కాదు. జరుగుతున్నది ప్రభుత్వ కార్యక్రమం. మంత్రి భార్యగా ఓ ప్రైవేటు వ్యక్తిగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారంతే. ఆమె వస్తున్నారని పోలీసులు ఎలాంటి ప్రొటోకాల్‌ పాటించాల్సిన అవసరం లేదు. అయినాసరే తమ కాన్వాయ్‌లో ఎస్‌ఐ రాలేదంటూ ఓ మంత్రి సతీమణి నడిరోడ్డు మీద స్థానిక ప్రజలు చూస్తుండగానే ఎస్‌ఐపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన ఏపీలో రాజకీయ దుమారం రేపింది.
రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖా మంత్రి మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి భార్య హరిత వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు చెలరేగడంతో పాటు వైసీపీ నేతలకు, టిడిపి నేతలకు తేడా ఏంటనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ వీడియో వైరల్ కావడం, టివి ఛానల్స్ లో కూడా రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ మంత్రికి ఫోన్ చేసి మందలించారు.
 
రవాణా శాఖ మంత్రి రాం ప్రసాద్‌ రెడ్డి సతీమణి హరిత స్థానిక ఎస్‌ఐతో మాట్లాడిన తీరును ముఖ్యమంత్రి తప్పుబట్టారు. రాంప్రసాద్‌ రెడ్డి అన్నమయ్య జిల్లాలోని రాయచోటి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సోమవారం ఆయన విశాఖ నగరంలో తమ శాఖకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పేదలకు పెంచిన పింఛను పంపిణీ కార్యక్రమంలో ఆయన తరఫున పాల్గొనాలని సతీమణి హరిత భావించారు. 
 
చిన్నమండెం మండలంలో పింఛన్ల పంపిణీకి తాను వెళ్తున్నాని, భద్రతా ఏర్పాట్ల కోసం తన వాహనానికి ఎస్కార్ట్‌గా రావాలని స్థానిక ఎస్‌ఐకి ఆమె చెప్పారు. అయితే ఎస్‌ఐ ఆలస్యంగా రావడంతో ఆమె పరుషంగా మాట్లాడారు. ఆమె మాట్లాడిన మాటలు టీవీల్లో విస్తృతంగా ప్రసారమయ్యాయి. ఈ విషయం తెలియగానే ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి రాంప్రసాద్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడి వివరణ కోరారు. 
 

‘అధికారులు, ఉద్యోగుల పట్ల అంతా గౌరవంగా మసలుకోవాలి. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఏ స్థాయి వారు వ్యవహరించినా ఉపేక్షించేది లేదు. ఇలాంటి వైఖరిని సహించేది లేదు’ అని ఆయన మంత్రికి స్పష్టం చేశారు. జరిగిన సంఘటనపై మంత్రి విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకొంటానని ముఖ్యమంత్రికి చెప్పారు.