పానీపూరీలో క్యాన్సర్‌ కారకాలు

పానీపూరీ తయారీలో వినియోగించే కృత్రిమ రంగుల్లో క్యాన్సర్‌ కారక రసాయనాలు ఉన్నట్టు తేలిందట. పలు రకాల ఆహారాల్లో కృత్రిమ రంగులు కలుపుతుండటంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న క్రమంలో కర్ణాటకలో ఆహార భద్రత విభాగం అధికారులు రాజధాని బెంగళూరుతో సహా 79 చోట్ల తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆందోళనకర విషయాలు గుర్తించారు.

చాలా పానీపూరీ నమూనాల్లో వాటి సాస్‌, స్వీట్‌ చిల్లీ పౌడర్లలో క్యాన్సర్‌ కారక రసాయనాలు ఉన్నట్టు తేలిందని ది టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా నివేదించింది. చాలా వరకూ శాంపిళ్లలో సన్‌సెట్‌ యెల్లో, బ్రిలియంట్‌ బ్లూ, కార్మోసిన్‌ రంగులు ఉన్నట్టు తేలిందని సంబంధిత అధికారులు తెలిపారు. 

బెంగళూరులో సేకరించిన 49కి 19 శాంపిళ్లలో సింథటిక్‌ రంగులు ఉన్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో పానీ పూరీ తయారీలో కృత్రిమ రంగులతో తయారు చేసే సాస్‌లు, స్వీట్‌ చిల్లీ పౌడర్లను రాష్ట్రవ్యాప్తంగా నిషేధించే యోచనలో అధికారులు ఉన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇటీవల గోబీ మంచూరియా, కబాబ్‌ల వంటి ఆహార పదార్థాల తయారీలో కృత్రిమ రంగుల వాడకాన్ని నిషేధిస్తూ కర్ణాటక ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. కాగా, కృత్రిమ రంగుల వలన అలర్జీ, పిల్లల్లో హైపర్‌ యాక్టివిటీ, అరుగుదల వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నదని, ఇదే సమయంలో ఎక్కువ కాలం ఈ సింథటిక్‌ రంగులను తీసుకోవడం వలన క్యాన్సర్‌కు గురయ్యే ప్రమాదం కూడా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.