తెలంగాణ హైకోర్టులో కేసీఆర్‌కు ఎదురుదెబ్బ

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విద్యుత్ కమిషన్‌ను రద్దుచేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ విషయంలో ప్రభుత్వ వాదనలను ఉన్నత న్యాయస్థానం సమర్దించింది. 
 
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం, థర్మల్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటులో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం వీటిపిై విచారణకు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్‌ను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.
 
ఈ పిటిషన్‌పై గత శుక్రవారం విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధే, జస్టిస్ జే అనిల్‌కుమార్‌ల ధర్మాసనం.. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వులో ఉంచింది. తాజాగా, సోమవారం నాడు తీర్పును వెలువరించిన ధర్మాసనం కేసీఆర్ పిటిషన్‌ను కొట్టివేసింది. 
 
కేసీఆర్ తరఫున హాజరైన సీనియర్‌ లాయర్ ఆదిత్య సోంధి.. రాజకీయ కక్ష సాధింపుతోనే కమిషన్‌ను ఏర్పాటు చేశారని ఆరోపించారు.విద్యుత్‌ కొనుగోళ్లలో ఎటువంటి అక్రమాలు జరగలేదని.. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్‌ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. దీనికి ప్రభుత్వ తరఫున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఓ పద్దతి ప్రకారమే విచారణ జరగుతోందని, ట్రాన్స్‌కో జెన్‌కో అధికారుల్ని సైతం విచారించిందని తెలిపారు.

అయితే, కమిషన్‌ ఏర్పాటు తీరుపైన అభ్యంతరాలున్నాయన్న కేసీఆర్ తరఫు లాయర్.. వాటిని పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపించారు. తన క్లయింట్‌కు ఏప్రిల్‌ 14న నోటీసులు జారీచేసి విచారణకు రావాలని కోరిందని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఉన్నందున గడువు కోరామని, విచారణను కమిషన్ వాయిదా వేసిందని చెప్పారు. 

 
ఈలోగానే జూన్‌ 11న జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి అరకొర సమాచారంతో మీడియా సమావేశం పెట్టారని ఆయన ఆరోపించారు. దీనికి ఏజీ బదులిస్తూ.. విద్యుత్ క‌మిష‌న్ చైర్మ‌న్ ఏక‌ప‌క్ష ధోర‌ణితో వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని తెలిపారు. కేసీఆర్ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని వాదించారు.