నీట్‌ వివాదంపై చర్చకు సిద్ధం

నీట్‌ పరీక్ష వ్యవహారంపై దర్యాప్తు జరుగుతున్నదని, ఈ వివాదంపై రాజకీయ స్టంట్‌లు, పరస్పర విమర్శలు మాని చిత్తశుద్ధితో చర్చించాల్సిన అవసరం ఉందని  బీజేపీ అధికార ప్రతినిధి షాజియా ఇల్మీ హితవు చెప్పారు. ఇది తీవ్రమైన అంశమని, నీట్‌ వివాదంతో లక్షలాది విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు కలత చెందుతున్నారని ఆమె చెప్పారు.

“ఈ విషయమై దర్యాప్తు జరుగుతుంది. ఈ అంశంపై రాజకీయ నాటకాలు ఆడటం లేదా ఒకరిపై మరొకరు నిందలు వేసుకోవడం కన్నా లోతుగా చర్చించాల్సి ఉంది. విద్యార్థులు, తల్లితండ్రులు పడుతున్న ఆవేదనను అర్ధం చేసుకొని తీవ్రమైన అంశంగా పరిగణించాలి” అంటూ ఆమె హితవు చెప్పారు.  

ఈ అంశంపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ నైతిక బాధ్యత తీసుకున్నారని ఆమె తెలిపారు. ఈ వ్యవహారంపై చర్చించేందుకు బీజేపీ, కేంద్ర ప్రభుత్వ బాధ్యులెవరూ వెనక్కిమళ్లడం లేదని ఆమె స్పష్టం చేశారు. నీట్‌ రగడపై చర్చించేందుకు తాము సిద్ధమని, సంప్రదింపుల ద్వారా ఈ అంశాన్ని చక్కదిద్దేందుకు తాము ముందుకొస్తామని ఆమె తెలిపారు.

“ఈ విషయమై ఇప్పటికే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన నైతిక బాధ్యత తీసుకున్నారు. బిజెపి గాని లేదా కేంద్ర ప్రభుత్వంలో మరెవరైనాగాని ఈ విషయమై చర్చకు వెనుకడుగు వేయడం లేదు. ఈ అంశంపై చర్చించి, ఓ పరిష్కారం కనుగొనేందుకు మేము సిద్ధంగా ఉన్నాం” అని ఆమె స్పష్టం చేశారు.

కాగా, నీట్‌ వ్యవహారంపై తాము మౌనం దాల్చలేదని, చర్యలు తీసుకుంటున్నామని, నిందితులను అరెస్ట్‌ చేస్తున్నామని బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ చెప్పారు. కాంగ్రెస్‌ మాదిరిగా తాము మాటలకే  పరిమితం కాకుండా కార్యాచరణ చేపడతామని చెప్పారు. దేశంలో ఎమర్జెన్సీ విధించిన 50 ఏండ్ల తర్వాత కూడా కాంగ్రెస్ తన తప్పిదానికి క్షమాపణలు చెప్పడం లేదని దుయ్యబట్టారు. 

ఇక అంతకుముందు నీట్‌ వివాదంపై కాంగ్రెస్‌ ఎంపీ, ఆ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ స్పందిస్తూ నీట్‌ రగడపై పార్లమెంట్‌ వేదికగా తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తెలిపారు. ఈ ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ) ఏం చేస్తుందనే విషయంపై తమ డిమాండ్లను లోక్‌సభ, రాజ్యసభ ముందుంచుతామని చెప్పారు.

అన్ని పరీక్షలను ఎన్టీఏ ప్రైవేట్ కంపెనీల ద్వారా నిర్వహిస్తోందని పేర్కొంటూ స్కామ్‌లు ఎక్కడ నుంచి వెలుగుచూస్తున్నాయో గమనించాలని ఆయన హితవు చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు బిహార్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ల నుంచే ఈ స్కామ్‌లు బయటపడుతున్నాయని ఆయన వివరించారు.