వెంకయ్యనాయుడు సేవలను దేశం ఎప్పటికీ మరవదు

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడితో సుదీర్ఘకాలం పని చేసే అవకాశం తనకు దక్కిందని, గ్రామ స్థాయి నుంచి ఉన్నత స్థానానికి ఆయన ఎదిగారని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. వెంకయ్యనాయుడు 75వ పుట్టిన రోజు సందర్భంగా  హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన జీవిత ప్రస్థానంపై మూడు పుస్తకాలను ప్రధాని మోదీ వర్చువల్‌గా విడుదల చేశారు. 

‘సేవలో వెంకయ్యనాయుడు జీవితం’, ’13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు లక్ష్యం, సందేశం’ ‘మహానేత వెంకయ్యనాయుడు జీవితం, ప్రయాణం’ అనే పుస్తకాలను మోదీ విడుదల చేశారు.  ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ వెంకయ్య నాయుడు జీవితంపై పుస్తకాలు ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయని కొనియాడారు. 

ఈ పుస్తకాలే దేశ ప్రజల సేవకు మార్గనిర్దేశనం చేస్తాయని చెప్పారు. వేలాది కార్యకర్తలు వెంకయ్య నుంచి ఎంతో నేర్చుకున్నారని, ఎమర్జెన్సీ సమయంలో వెంకయ్య పోరాటం చేయడంతో పాటు 17 నెలలు జైలు జీవితం గడిపారని గుర్తు చేశారు.

గ్రామీణ, పట్టణాభివృద్ధి శాఖలో తనదైన ముద్ర వేశారని, స్వచ్ఛభారత్, అమృత్ యోజన వంటి ఎన్నో పథకాలు సమర్థంగా అమలు చేశారని, వెంకయ్య చాతుర్యం, వాగ్దాటి ముందు ఎవరూ నిలువలేరని ప్రధాని పేర్కొన్నారు. రాజ్య సభ చైర్మన్ గా సభను సజావుగా నడిపారని, ఆయన సేవలను దేశం ఎప్పటికీ మరవదని చెప్పారు. 

ఆర్టికల్ 370 రద్దు బిల్లు తొలుత రాజ్యసభ ముందుకు వచ్చిందని, ఈ బిల్లు విషయంలో వెంకయ్య కీలక పాత్ర పోషించారని మోదీ కొనియాడారు. రాజ్య సభ నిర్వహణలో వెంకయ్య అనుభవం చాలా ఉపయోగపడిందని చెబుతూ దీర్ఘకాలం వెంకయ్య ఆరోగ్యంగా ఉండి మార్గనిర్దేశం చేయాలని  ప్రధాని కోరారు.

కాగా, దేశ ప్రజలకు ప్రధాని అందిస్తున్న సేవలు కొనసాగించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. రిఫార్మ్, పర్ ఫార్మ, ట్రాన్స్ ఫార్మ్ నినాదంతో ముందుకెళ్తున్నారని చెబుతూ అవసరం ఉన్నంత వరకు ఉచిత రేషన్ పథకం కొనసాగించాలని సూచించారు.

యువతకు నైపుణ్యం శిక్షణ కార్యక్రమాలను కొనసాగించాలని, మాతృభాషలను ప్రోత్సహించడం గొప్ప విషయం కితాబిచ్చారు. తాను ఆంగ్ల భాషకు వ్యతిరేకం కాదని, ప్రభుత్వ ఆదేశాలన్నీ భారతీయ భాషల్లో ఉండాలని, ఆ తరువాతే ఆంగ్ల భాషలో ఉండాలని కోరుతున్నామని తెలిపారు. మాతృభాష, సోదర భాష తర్వాతే ఇతర భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలని వెంకయ్య స్పష్టం చేశారు.

ఉత్సాహం ఉన్నవాళ్లు రాజకీయాల్లోకి రావాలని, సిద్దాంతపరమైన రాజకీయాలను ప్రోత్సహించాలని, చట్ట సభలకు ఎంపికైనవారు హుందాగా ప్రవర్తించాలని, విలువలు పాటిస్తూ మాతృభాషను ప్రోత్సహిస్తూ ముందుకు సాగాలని  వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.  

విలువలు కాపాడాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపై ఉందని, అయితే ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటున్నారో తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సిద్దాంతం నచ్చకపోతే నాయకులు పార్టీ మారవచ్చని, పార్టీ ద్వారా వచ్చిన పదవిని వదిలి వెళ్లాలని సూచించారు. కార్యకర్తలకు నేతలు ప్రవర్తనా నియమావళి రూపొందించాలని, రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకరావాడానికి ప్రయత్నించాలని కోరారు.  

రాజకీయాల్లో కులం, ధనం ప్రభావం తగ్గిపోవాలని పిలుుపునిచ్చారు. గుణం చూసి నాయకులకు ఓటు వేయాలని పేర్కొంటూ మార్పు రాకపోతే ప్రజాస్వామ్యం బలహీనపడుతుందని హెచ్చరించారు. దేశ ప్రతిష్ఠను నిలబెట్టాలంటే చెడుపోకడలను అడ్డుకోవాలని వెంకయ్య నాయుడు సలహాలు ఇచ్చారు.