మోదీతో మరోసారి అరకు కాఫీ తాగేందుకు ఎదురుచూస్తున్న చంద్రబాబు

ఎన్నికల విరామం అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పునరుద్ధరించిన మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ఆదివారం ఆంధ్ర ప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన అరకు కాఫీ గురించి ప్రస్తావించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతోషం ప్రకటించారు. అందుకు ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

మోదీతో మరోసారి అరకు కాఫీ తాగేందుకు ఎదురుచూస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. అరకు కాఫీని గిరిజన సోదరీమణులు ప్రేమ, భక్తితో పండిస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రజల అపరిమితమైన సామర్థ్యానికి ఇది ప్రతిబింబమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా `మేడ్‌ ఇన్‌ ఆంధ్ర’ ఉత్పత్తిగా అరకు కాఫీని ఆమోదించిన ప్రధాని మోదీకి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

భారతదేశ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఉందనీ అలాంటి వాటిలో ఆంధ్రప్రదేశ్‌లోని అరకులో పండే కాఫీ ఒకటని ప్రధాని నరేంద్ర మోదీ మన్‌ కీ బాత్‌లో చెప్పారు. విశాఖపట్టణం వచ్చినప్పుడు, ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి ఆ కాఫీ తాగినట్లు గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు చంద్రబాబుతో కలిసి అరకు కాఫీ తాగుతున్న ఫొటోను సామాజిక మాధ్యమం ఎక్స్‌లో మోదీ పోస్ట్ చేశారు.

అరకు కాఫీ సామాజిక, ఆర్ధిక ప్రాధాన్యతను వివరిస్తూ 1.5 లక్షల గిరిజన కుటుంబాలు వీటిని పండిస్తున్నాయని ప్రధాని చెప్పారు. వీరిని ఈ పంట పండించడంలో గిరిజన సహకార  సహకార సంఘాలు ప్రోత్సహిస్తున్నాయని, దానితో వారికి మంచి ఆదాయం కూడా లభిస్తున్నదని ప్రధాని తెలిపారు.

అరకు కాఫీకి దిల్లీలో జరిగిన జీ20 సమ్మిట్‌లోనూ ప్రశంసలు దక్కాయని చెప్పారు. ఈ కాఫీ సాగుతో గిరిజన సాధికారతకు ముడిపడి ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా మీరు ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా కాఫీ ప్రియులైతే, ఆంధ్రప్రదేశ్‌లోని అరకు నుంచి వచ్చే కాఫీని రుచి చూడాలని మోదీ ట్వీట్ చేశారు.

మరోవైపు దేశం మొత్తంగా 12 రాష్ట్రాలు కాఫీని ఉత్పత్తి చేస్తున్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి. ఏపీలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో కాఫీ తోటలు సాగవుతున్నాయి. అత్యంత నాణ్యమైన కాఫీ గింజలు ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయి. అందుకే అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. 

సేంద్రియ పద్ధతుల్లో పండించడంతో ఇక్కడి కాఫీ పంటకు డిమాండ్‌ ఎక్కువ. సముద్ర మట్టానికి 3,600 మీటర్ల ఎత్తులో గిరిజన కుటుంబాలు సంప్రదాయ పద్ధతిలో పండించే ఈ కాఫీ గింజలను ప్రైవేట్ వ్యాపారులతో పాటు గిరిజన సహకార సంస్థ (జీసీసీ) సేకరిస్తుంది. అందులో కొంత మొత్తాన్ని ఈ వేలం ద్వారా అమ్మకాలు చేస్తుంది. మరికొన్నింటిని అరకువ్యాలీ కాఫీ పేరుతో మార్కెంటింగ్‌ చేస్తోంది.