రాజీవ్ గాంధీ విమానాశ్రయ కస్టమ్స్ అధికారులపై సీబీఐ కేసు

విదేశీ కరెన్సీ అక్రమ రవాణా కేసులో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ద్వారా భారీగా విదేశీ కరెన్సీ స్మగ్లింగ్ జరుగుతుందని ఈ ఏడాది మార్చి 16న వెలుగులోకి వచ్చింది. 

సీఐఎస్ఎఫ్ సిబ్బందితో పాటు క్రైం అండ్ ఇంటెలిజెన్స్ అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో భారతీయ కరెన్సీతో విదేశీ కరెన్సీని మార్పిడీ చేస్తున్నారన్న సమాచారంతో సిటీ సైడ్ అరైవల్ ఏరియాలో నలుగురు వ్యక్తులను పట్టుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలోని సీఐఎస్ఎఫ్ సిబ్బంది, కస్టమ్స్ విభాగంలో వరుసగా ఆఫీస్ బాయ్, లోడర్గా పని చేస్తున్న ఓం ప్రకాశ్ దత్తా, ఎల్.సంజయ్ పాల్ అనే ఇద్దరు వ్యక్తులను వివిధ దేశాల విదేశీ కరెన్సీని మార్పిడీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 

హైదరాబాద్లోని బహదూర్పురా నివాసితులు గులాం అలీ అతని కుమారుడు సాజిద్తో కలిసి రూ.4.04 లక్షల విలువైన భారతీయ కరెన్సీని తీసుకువెళుతున్నారు. విదేశీ కరెన్సీలలో యూఎస్డీ, సౌదీ రియాల్స్, దిర్హామ్, ఒమన్ రియాల్స్, సింగపూర్ డాలర్, కువైట్ దినార్ ఉన్నాయి.

సీఐఎస్ఎఫ్ సిబ్బంది నగదును స్వాధీనం చేసుకుని కస్టమ్ అధికారులకు అప్పగించారు. విదేశీ కరెన్సీని పి.చక్రపాణి, వై.శ్రీనివాసులు, సూపరింటెండెంట్లు, హైదరాబాద్లోని ఆర్జీఐఏలో పని చేస్తున్న ముగ్గురు, కస్టమ్స్ విభాగంలో పని చేస్తున్న ఇన్స్పెక్టర్ పంకజ్ కుమార్ గౌతమ్ నుంచి ఓం ప్రకాశ్ దత్తా అందుకున్నట్లు విచారణలో తేలింది. 

ఈ విదేశీ కరెన్సీ స్మగ్లింగ్ గత కొంతకాలంగా కొనసాగుతున్నట్లు తదుపరి విచారణలో వెల్లడైంది. సీఐఎస్ఎఫ్ అధికారులు సీజ్ చేసిన కరెన్సీని తదుపరి చర్యల నిమిత్తం కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. కస్టమ్స్ డిపార్ట్మెంట్ విచారణ నిమిత్తం సీబీఐ సహాయాన్ని కోరింది.

ఆ తర్వాత సీబీఐ రంగంలోకి దిగడంతో హైదరాబాద్లోని ఆర్జీఐఏలోని కస్టమ్స్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ వై.శ్రీనివాసు, పేరి చక్రపాణి హైదరాబాద్ కస్టమ్స్ డిపార్ట్మెంట్, ఆర్జీఐఏ ఇన్పెక్టర్ పంకజ్ గౌతమ్ ప్రాథమికంగా అవినీతికి పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ముగ్గురు కస్టమ్స్ అధికారుల ఇళ్లు, కార్యాలయంలో సోదాలు జరిపి కీలకమైన పత్రాలను సీబీఐ స్వాధీనం చేసుకుంది. అనంతరం కేంద్ర దర్యాప్తు సంస్థ ఐపీసీ సెక్షన్ 120 బీ నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి సీబీఐ దర్యాప్తు చేస్తోంది.