భారత జట్టుకు బీసీసీఐ రూ. 125 కోట్ల నజరానా

టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ సాధించిన భారత జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ నగదు బహుమతి ప్రకటించింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా  వెల్లడించారు. టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ గెలిచిన భారత జట్టుకు ఏకంగా రూ.125 కోట్ల నగదు బహుమతిని బీసీసీఐ ప్రకటించింది.

 “ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ గెలిచిన భారత జట్టుకు రూ.125కోట్ల ప్రైజ్‍మనీ ప్రకటిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. టోర్నమెంట్ మొత్తం అసాధారణమైన ప్రతిభ, అంకితభావం, క్రీడాస్ఫూర్తిని, నైపుణ్యాలను జట్టు ప్రదర్శించింది. అద్భుత విజయాన్ని సాధించిన ఆటగాళ్లు కోచ్‍లు, సహాయకసిబ్బంది అందరికీ అభినందనలు” అని జై షా నేడు ట్వీట్ చేశారు.

టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలిచిన టీమిండియాకు రికార్డు స్థాయిలో బీసీసీఐ నగదు బహుమతి ప్రకటించింది. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో రూ.125కోట్ల నజరానా ఇవ్వలేదు. టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలిచిన భారత జట్టుకు 2.45 మిలియన్ డాలర్లు (సుమారు రూ.20.42 కోట్లు) అందజేసింది ఐసీసీ. అయితే, బీసీసీఐ అంతకు 600 శాతం (ఆరు రెట్లు) కంటే ఎక్కువ బహుమతిని తన జట్టు టీమిండియాకు ఇచ్చింది. ఏకంగా రూ.125 కోట్లు ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత ధనికమైన క్రికెట్ బోర్డుగా బీసీసీఐ ఉంది.