అస్సాం మార్క్స్‌షీట్‌ స్కామ్‌ లో ఎనిమిది మంది అరెస్ట్

నీట్‌ స్కామ్‌ మరువక ముందే అస్సాంలో మరో స్కాం వెలుగుచూసింది.  గౌహతి యూనివర్సిటీలో ‘క్యాష్‌ ఫర్‌ మార్క్స్‌’ స్కామ్‌ బయటపడింది. ఈ కేసుకు సంబంధించి ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. గౌహతి యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్న గణేష్ లాల్ చౌదరి కాలేజీకి చెందిన విద్యార్థి అజీజుల్‌ హక్‌ మార్క్‌షీట్‌లో తేడా కనిపించింది. 

పరీక్షలకు సంబంధించిన వాస్తవ మార్కులు మార్క్‌షీట్‌లోని మార్కుల మధ్య తేడాను కాలేజీ యాజమాన్యం గమనించింది. యూనివర్సిటీకి పంపి తనిఖీ చేయించింది. విద్యార్థి డబ్బులు చెల్లించి మార్కులు పెంచుకున్నట్లు బయటపడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.  గురువారం బారాపెట్ పర్యటనకు వచ్చిన అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మ దృష్టికి ఈ కుంభకోణం రావడంతో వెంటనే తగు చర్యలు తీసుకోమని ఆయన ఆదేశించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీఐడీ విభాగం దీనిపై దర్యాప్తు చేసింది. 

విద్యార్థి అజీజుల్‌ హక్‌ను ప్రశ్నించగా మొదటి, మూడు, నాలుగు, ఐదవ సెమిస్టర్‌లలో మార్కులు మార్చడానికి రూ.10,000 చెల్లించినట్లు అంగీకరించాడు. దీంతో గౌహతి యూనివర్సిటీ మార్క్‌షీట్‌లతో వ్యవహరించే కంప్యూటర్ సిస్టమ్‌ ఆపరేట్ చేసేవారు విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకుని మార్క్‌షీట్‌లను డిజిటల్‌గా ట్యాంపరింగ్‌ చేసినట్లు గుర్తించారు.

డిజిటల్‌ ట్యాంపరింగ్‌తో కొంతమంది ఈ స్కామ్‌కి పాల్పడుతున్నారని, మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. అజీజుల్‌ హక్‌ మార్క్‌షీటుపై కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విద్యార్థి పొందిన మార్కుల కన్నా మార్క్‌షీటులో ఎక్కువ మార్కులు ఉన్నట్లు తేలింది.

బార్‌పేటలో ఆరు కేసులు వెలుగు చూశాయని, ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు.  గౌహతి విశ్వవిద్యాలయం ఇంటిగ్రేటెడ్‌ యూనివర్శిటీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఐయుఎంఎస్‌) ని థర్డ్‌పార్టీకి ఆపరేటర్‌కి అవుట్‌ సోర్స్‌ కింద ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐటిఐ లిమిటెడ్‌ అనేది డేటా ఎంట్రీ బాధ్యత వహించే కేంద్ర ప్రభుత్వ సంస్థ అని, ట్యాంపరింగ్‌ జరిగినట్లు ఆ వర్గాలు తెలిపాయి.

బార్‌పేట, ధుబ్రి, కమ్‌రూప్‌ (మెట్రో), నాగావ్‌ అనే నాలుగు జిల్లాల నుండి అరెస్టులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. కృష్ణమూర్తి, ఇస్మాయిల్‌ హుస్సేన్‌, అలంగీర్‌ ఖాన్‌, మొయినుల్‌ హక్‌, అబుల్‌ బాసర్‌, అమీనుల్‌ ఇస్లాం, హమేజుద్దీన్‌, శివతోష్‌ మహతోలను అరెస్ట్‌ చేశామని చెప్పారు. కృష్ణమూర్తి ఈ స్కాంలో కీలకపాత్రధారి అని, యూనివర్శిటీ బృందానికి నేతృత్వం వహించాడని అన్నారు.