2030 నాటికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం విచ్ఛిన్నం!

పాతికేళ్లుగా అంతరిక్షంలో వ్యోమగాములకు ఆవాసంగా ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని (ఐఎస్‌ఎస్‌) అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) విచ్ఛిన్నం చేయబోతున్నది. 2030 నాటికి ఈ పని పూర్తి చేయడానికి ఇప్పటికే ప్రణాళిక రూపొందించింది. ఇందుకుగానూ అంతరిక్ష కేంద్రాన్ని తిరిగి భూమికి తీసుకువచ్చేందుకు ఒక భారీ వ్యోమనౌక(డీఆర్బిట్‌ వెహికిల్‌)ను తయారుచేసే బాధ్యతను ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌కు అప్పగించింది.

ఇప్పటికే ఇందుకోసం స్పేస్‌ఎక్స్‌కు నాసా రూ.7 వేల కోట్లు చెల్లించినట్టు అంతర్జాతీయ మీడియా పేర్కొన్నది.  ఈ వాహనం భూఉపరితలానికి 250 మైళ్ల ఎత్తులో(దాదాపు 400 కిలోమీటర్లు) ఉన్న అంతరిక్ష కేంద్రాన్ని భూ వాతావరణంలోకి లాక్కొస్తుంది. భూవాతావరణంలోకి రాగానే అధిక ఉష్ణోగ్రతల కారణంగా అంతరిక్ష కేంద్రం దహనమైపోతుంది.

 ప్రస్తుతం దాదాపు భూ ఉపరితలానికి 250 మైళ్ల ఎత్తులో ఉన్న అంతరిక్ష కేంద్రాన్ని 2030 మధ్యలో క్రమంగా 200 మైళ్ల ఎత్తుకు, ఆ తర్వాత 175 మైళ్ల ఎత్తుకు తీసుకువస్తారు. తర్వాత అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమగాములు అందరూ కీలకమైన సామాగ్రిని తీసుకొని భూమి మీదికి తిరిగి వచ్చేస్తారు.  అప్పుడు ‘స్పేస్‌ఎక్స్‌’ తయారుచేస్తున్న డీఆర్బిట్‌ వెహికిల్‌ అంతరిక్ష కేంద్రాన్ని భూమికి మరింత చేరువగా లాక్కొస్తుంది. భూఉపరితలానికి 75 మైళ్ల సమీపానికి వచ్చిన తర్వాత భూవాతావరణంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా అంతరిక్ష కేంద్రం, డీఆర్బిట్‌ వెహికిల్‌ దహనం అయిపోతాయి. 

ఈ శకలాలు దాదాపుగా కరిగిపోతాయని, భూమి మీద పడే ముప్పు చాలా తక్కువగా ఉన్నట్టు నాసా అంచనా వేస్తున్నది. కొన్ని భాగాలు మిగిలిపోయినా సముద్రంలో పడతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉపయోగించిన పరికరాలు ఇప్పుడు చాలా వరకు కాలం చెల్లిపోయాయి. భవిష్యత్తు ప్రయోగాలకు సరిపడే సౌకర్యాలు లేవు. 

పైగా ఇందులో నుంచి గ్యాస్‌, కూలెంట్‌ వంటివి గత కొన్నేండ్లుగా లీక్‌ అవుతున్నాయి. దీనికి కావాలనే చేసిన ఒక రంధ్రం కూడా ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే 2025 తర్వాత అంతరిక్ష కేంద్రం పనికిరాదనే చర్చను అంతరిక్ష శాస్త్రవేత్తలు తెరపైకి తెస్తున్నారు.  దీంతో ఇక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని విచ్ఛిన్నం చేయకతప్పదని నాసా ఒక నిర్ణయానికి వచ్చింది. అయితే, దీనిని మళ్లీ భూమి మీదకు తీసుకువచ్చి, తిరిగి ఉపయోగించడం చాలా కష్టమని, పైగా భారీ ఖర్చుతో కూడుకున్నదని భావించి విచ్ఛిన్నానికే మొగ్గు చూపింది.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని 1984 నుంచి 1993 మధ్య డిజైన్‌ చేశారు. అమెరికాతో పాటు కెనెడా, జపాన్‌, యూరోప్‌, రష్యా వంటి దేశాలు కలిసి దీనిని తయారుచేశాయి. 1998 నవంబరు 20న భూమి నుంచి ప్రయోగించారు. ఇప్పటి కరెన్సీ విలువతో చూసుకుంటే ఇందుకు దాదాపు రూ.8 లక్షల కోట్లు ఖర్చు చేశారు. 

2000 సంవత్సరం నుంచి ఇది అంతరిక్ష ప్రయోగాలకు కేంద్రంగా, వ్యోమగాములకు ఆవాసంగా సేవలు అందిస్తున్నది. ఇప్పటివరకు 19 దేశాలకు చెందిన 244 మంది వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు.