తిరుమలలో జగన్ హయాంలో అక్రమాలపై దర్యాప్తు

గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో చోటు చేసుకున్న అక్రమాలపై రాష్ట్ర విజిలెన్సు అధికారులు లోతయిన దర్యాప్తు చేపట్టారు. ఇంజనీరింగ్‍ విభాగంలో చేపట్టిన నిర్మాణాలు, శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగం, వీఐపీ టికెట్ల కేటాయింపులో అవకతవకలపై విజిలెన్స్ అధికారులు పూర్తి స్ధాయి విచారణ చేపట్టారు. 

ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగానే తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పరిపాలన ప్రక్షాళన తిరుమల నుండే ప్రారంభిస్తానని ప్రకటించడం గమనార్హం. ఆయన ప్రకటనకు అనువుగా విజిలెన్సు అధికారుల బృందం ఇక్కడకు చేరుకొని గోప్యంగా ఫైల్స్ ను తనిఖీ చేస్తున్నట్లు తెలుస్తోంది

టీటీడీలో ముఖ్యంగా ఐదు అంశాలపై అక్రమాలు నిగ్గు తెల్చేందుకు అధికారులు సోదాలు చేబట్టినట్టు చెబుతున్నారు.  ఆర్జిత సేవ, వీఐపీ బ్రేక్‍ దర్శన టికెట్ల కేటాయింపు, ఇంజనీరింగ్‍ విభాగంలో వందల కోట్ల రూపాయల నిధుల వ్యయం, శ్రీవాణి ట్రస్టు టికెట్ల అమ్మకాలు, తిరుమలలో వసతి గృహల ఆధునికీకరణపై రాష్ట్ర విజిలెన్స్ విభాగం దృష్టి సారించింది. 

శ్రీవాణి ట్రస్టు ద్వారా దర్శన టికెట్లు కేటాయించి సమకూరిన నిధుల వినియోగంపై విజిలెన్స్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. శ్రీవాణి ట్రస్టు నిధులతో ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల పునరుద్దరణ పనులపై ఆరా తీస్తున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో తిరుమలలో భక్తుల వసతి గృహల ఆధునికీకరణ పేరుతో కోట్ల రూపాయల నిధులు వ్యయం చేయడంపైనా విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. 

వరాహస్వామి అతిథి గృహం, నారాయణగిరి వసతి గృహలతో పాటు సాధారణ భక్తులకు కేటాయించే వసతి గృహల ఆధునికీకరణ కోసం కేటాయించిన నిధుల వివరాలను సేకరిస్తున్నారు. మరోవైపు తిరుపతిలో గోవిందరాజస్వామి సత్రాలను కూల్చి వేసి 460 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణాలు చేపట్టిన వసతి గృహల టెండర్లు, తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. 

తిరుమలలో డోనేషన్‍ విధానంలో కాటేజీల కేటాయింపులో చోటు చేసుకున్న అక్రమాలను గుర్తించే దిశగా చర్యలు ప్రారంభించారు. నిత్యాన్నదానం, లడ్డు ప్రసాదాల తయారీకి అవసరమైన ముడిసరుకుల కొనుగోలు, తదితర అంశాలపై దస్త్రాలను పరిశీలిస్తున్నారు.