హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్న జగన్‌

ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోదామని అనిపించిందని ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ షాక్‌లో నుంచి బయటకు రావడానికి రెండు మూడు రోజులకు పైనే సమయం పట్టిందని చెప్పారు. వైసీపీ నుంచి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో గత వారం నిర్వహించిన సమావేశంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.

“ఎన్నికల్లో సీట్లు రాకపోయినా 40 శాతం ఓట్లు వైసీపీకి వచ్చాయి. అంటే పెద్ద సంఖ్యలో జనాలు మన పట్ల నమ్మకాన్ని పెట్టుకున్నారు. అది తెలిసి వాళ్ల కోసం నిలబడాలని అనిపించది. మనల్ని నమ్మి ఓట్లు వేసిన జనం కోసం పనిచేయాలని అనిపించింది” అంటూ వారికీ ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. 

అందుకే ఎన్నికల రిజల్ట్‌ షాక్‌లో నుంచి మెల్లగా బయటకు వచ్చానని వైసీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులతో జగన్‌ అన్నారని తెలిసింది.  ఎన్నికలకు ముందు అనేక సర్వేలు చేయించామని, వాటిలో ఎక్కడా కూడా వ్యతిరేకత రాలేదని అంటూ విస్మయం వ్యక్తం చేశారు.  అందుకే చాలా ఆత్మవిశ్వాసంతో ఎన్నికలకు వెళ్లామని, కానీ ఫలితాలు మాత్రం భిన్నంగా వచ్చాయని అంటూ విచారం వ్యక్తం చేశారు. 

“ఆ ఫలితాలు చూశాక అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోదామని అనిపించింది. ఆ రిజల్ట్‌ చూసి నా పరిస్థితే ఇలాగా మారితే.. క్షేత్రస్థాయిలో మీరు మరింత ఇబ్బంది పడే ఉంటారు. మీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. నేను బయటకొచ్చినట్లే మీరూ ఎన్నికల ఫలితాల నుంచి బయటకు రండి” అని వైసీపీ అభ్యర్థులతో జగన్‌ అన్నట్లు తెలిసింది. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడే కార్యక్రమాలకు సిద్ధం కావాలని సూచించినట్లు సమాచారం.

తాడేపల్లిలోని వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో జూన్‌ 20వ తేదీన జరిగిన ఈ సమావేశంలో వైసీపీ శ్రేణులకు జగన్‌ దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికల్లో 40 శాతం ఓట్లు మనకు వచ్చాయన్న విషయం మరిచిపోవద్దని వైసీపీ శ్రేణులతో జగన్‌ పేర్కొన్నారు. 2019తో పోలిస్తే 10 శాతం ఓట్లు తగ్గాయని తెలిపారు. ఆ పది శాతం జనాలు కూడా చంద్రబాబు మోసాలను, ప్రలోభాలను ఇట్టే గుర్తిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. 

ప్రతి కుటుంబానికి మనం చేసిన మంచి ఏంటో తెలుసుని విశ్వసనీయతకు మనమే చిరునామా అని స్పష్టం చేశారు. మనం చేసిన మంచే మనకు శ్రీరామరక్ష అని, మనం అందించే పాలనను ప్రజలు మరిచిపోరని చెప్పారు. తిరిగి 2029లో వైసీపీనే ప్రజలు అధికారంలోకి తెచ్చుకుంటారని ధీమా వ్యక్తం చేశారు.