మత స్వేచ్ఛపై ఆమెరికా ఆరోపణలు కొట్టేసిన భారత్ 

భారత్‌లో మైనారిటీలపై ద్వేషం పెరుగుతోందని మత స్వేచ్ఛపై ఆమెరికా విదేశాంగ శాఖ ఒక నివేదికను విడుదల చేసింది. అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన ఈ నివేదికను భారత్ తోసిపుచ్చింది. మత స్వేచ్ఛపై అమెరికా విడుదల చేసిన నివేదికను తిరస్కరిస్తున్నామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్  స్పష్టం చేశారు.

అమెరికా నివేదికలో చాలా పక్షపాతం ఉందని, భారతదేశ సామాజిక నిర్మాణంపై అవగాహన లేకుండా అమెరికా ప్రత్యేక కథనాన్ని రూపొందించిందని జైస్వాల్‌ మండిపడ్డారు. భారతీయ న్యాయస్థానాలు ఇచ్చిన కొన్ని చట్టపరమైన తీర్పుల సమగ్రతను కూడా ఈ నివేదిక సవాలు చేసేలా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.

కాగా భారత్‌లో మైనారిటీలపై ద్వేషం పెరుగుతోందని అమెరికా బుధవారం రిలీజియస్ ఫ్రీడం రిపోర్టును విడుదల చేసింది. భారతదేశంలో మైనారిటీ వర్గాలపై హింసాత్మక దాడులు జరుగుతున్నాయని ఆ నివేదికలో పేర్కొంది. ఇది మే 2023లో మణిపూర్‌లో ప్రారంభమైన హింసను కూడా ప్రస్తావించింది.

‘అమెరికా నివేదిక తీవ్ర పక్షపాతంతో కూడుకున్నది. భారతదేశ సామాజిక నిర్మాణంపై అవగాహన లేదు. కాబట్టి మేము దానిని తిరస్కరిస్తున్నాం. ఈ నివేదికలో ఆరోపణలు, తప్పుడు అంశాలు, అసత్యాలు, పక్షపాత మూలాలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది ఏకపక్ష అంచనాల మిశ్రమం’ అని జైస్వాల్‌ వ్యాఖ్యానించారు.