యుద్ధ ట్యాంక్‌ కొట్టుకుపోయి అయిదుగురు సైనికులు మృతి

చైనా స‌రిహ‌ద్దు ఉన్న న‌దిలో విషాదం చోటుచేసుకున్న‌ది. యుద్ధ ట్యాంక్ ఆ న‌దిలో కొట్టుకుపోయింది. దాంట్లో అయిదుగురు సైనికులు ఉన్నారు. వారిలో ఓ జేసీవో ఆఫీస‌ర్ ఉన్నారు. నియంత్ర‌ణ రేఖ వ‌ద్ద లేహ్‌లో ఉన్న దౌల‌త్ బేగ్ ఓల్డీ ఏరియా వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది. రెస్క్యూ అధికారులు ఒక‌రి మృత‌దేహాన్ని వెలికితీశారు. మ‌రో న‌లుగురు గల్లంతయ్యారు.

ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారిలో జూనియ‌ర్ క‌మీష‌న్డ్ ఆఫీస‌ర్ ఒకరు ఉన్నారు. శుక్ర‌వారం అర్థ‌రాత్రి ఒంటి గంట స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగినట్లు అంచ‌నా వేస్తున్నారు. శిక్ష‌ణ‌లో ఉన్న సైనికులు మందిర్ మోర్చ్ వ‌ద్ద ఉన్న బోధి న‌దిలో యుద్ధ ట్యాంక్‌తో క్రాస్ చేస్తున్నారు. ఆ స‌మ‌యంలో ఆ ట్యాంక్ కొట్టుకుపోయింది.

లేహ్ నుంచి 148 కిలోమీట‌ర్ల దూరంలో ఆ ట్యాంక్ ఉన్న‌ది. టీ-72 యుద్ధ ట్యాంక్ ప్ర‌మాదంలో కొట్టుకుపోయింది. ట్రైనింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఒక్క‌సారిగా నీటి మ‌ట్టం పెరిగిన‌ట్లు అధికారులు చెప్పారు. ఉప్పొంగుతున్న న‌దిలో యుద్ధ ట్యాంక్‌తో పాటు సైనికులు నీట మునిగి మ‌ర‌ణించారు.

భార‌తీయ ఆర్మీ సైనికుల మృతి ప‌ట్ల ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సంతాపం తెలిపారు. దుర‌దృష్ట‌క‌ర సంఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు త‌న ఎక్స్ అకౌంట్‌లో వెల్ల‌డించారు. దేశం కోసం విరోచిత సేవ‌లు అందించిన ఆ సైనికుల‌ను ఎన్న‌టికీ మ‌రిచిపోలేమ‌ని చెప్పారు. బాధిత కుటుంబ‌స‌భ్యుల‌కు ఆయ‌న ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద స‌మ‌యంలో దేశం ఆ కుటుంబాల‌కు అండ‌గా ఉంటుంద‌ని మంత్రి రాజ్‌నాథ్ వెల్ల‌డించారు.