ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతి

తెలంగాణ సీనియర్ రాజకీయ నేత, ఆదిలాబాద్ మాజీ ఎంపీ, బీజేపీ నేత  రమేష్ రాథోడ్ కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి ఉట్నూర్‌లోని తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు దగ్గరలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రమేష్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించగా మార్గ మధ్యలోనే తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది.

షెడ్యూల్ తెగలకు చెందిన రమేష్ రాథోడ్, అట్టడుగు స్థాయి నుంచి రాజకీయ నాయకుడుగా ఎదుగుతూ వచ్చారు. ఆయనకు సుదీర్ఘ రాజకీయ అనుబంధం ఉంది. రమేష్ రాథోడ్ ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలంలోని తాడిహత్నూర్‌లో 1966 అక్టోబరు అక్టోబర్ 20న జన్మించారు. ప్రాథమిక విద్య నార్నూర్ మండలంలోని జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగింది. 

 
ఉట్నూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేయగా, ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ (బీఏ) పూర్తి చేశారు. రమేష్ రాథోడ్ తెలుగుదేశం పార్టీలో చేరి నార్నూర్ జెడ్పీటీసీగా గెలిచారు. ఆ తర్వాత ఖానాపూర్ నియోజకవర్గంలో టీడీపీ నుంచి 1999లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో టీడీపీ నుంచి ఆదిలాబాద్ ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. 
 
అలాగే ఆయన జెడ్పీ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా టీడీపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరారు. అనంతర పరిణామాలతో కాంగ్రెస్‌ పార్టీలో చేరి 2018లో ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2019లో ఆదిలాబాద్ ఎంపీగా ఎంపీగా పోటీ చేయగా ఓటమి ఎదురైంది. 
 
ఆ తర్వాత జూన్ 2021లో ఈటెల రాజేందర్ తో పాటు రమేష్ రాథోడ్ బీజేపీలో చేరారు.. గతేడాది తెలంగాణ ఎన్నికల్లో ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. రమేష్ రాథోడ్ ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో రమేష్ రాథోడ్ తన ప్రత్యేక ముద్ర వేశారని, తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 
మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మరణంపై తెలంగాణ బీజేపీ విచారం వ్యక్తం చేసింది. ప్రజా నాయకులు, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు, ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ ఆకస్మిక మరణం ఎంతో బాధాకరమని ఎక్స్ వేదిక పోస్టు పెట్టింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ప్రగాఢ సానుభూతి తెలియజేసింది.
 
మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నాయకుడు రమేశ్ రాథోడ్ గారి మృతిపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ  అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
బీజేపీలో క్రియాశీలకంగా పనిచేశారని, మొన్నటి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లోనూ చాలా ఉత్సాహంగా పార్టీకోసం కష్టపడ్డారని కొనియాడారు.
తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు.
 
రమేష్ రాథోడ్ మృతి పట్ల బిజెపి ఓబిసి మోర్చా అధ్యక్షుడు, ఎంపీ డా. కె లక్ష్మణ్, కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్, బిజెపి శాసనసభాపక్ష నేత యేలేటి మహేశ్వర్ రెడ్డి తదితరులు ప్రగాఢ సంతాపం తేలిపారు.