ఢిల్లీ మంత్రి అతిషిపై పరువు నష్టం కేసు

ఢిల్లీ మంత్రి అతిషిపై ఢిల్లీ బీజేపీ మీడియా చీఫ్‌ ప్రవీణ్ శంకర్‌ కపూర్‌ దాఖలు చేసిన పరువు నష్టం కేసును రౌస్‌ అవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించింది. కేసు విచారణను జూలై 23వ తేదీకి లిస్ట్‌ చేసింది. ఈ కేసులో మంత్రి అతిషి తరఫున లాయర్‌ వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు. 
 
బీజేపీ నేత తరఫున న్యాయవాది శౌమేందు ముఖర్జీ మాట్లాడుతూ అతిషి తన న్యాయవాదులతో వీసీ ద్వారా హాజరయ్యారని, సమన్లు అందజేయలేదని పేర్కొన్నారు. ఆప్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎమ్మెల్యేలకు డబ్బులు ఆశ చూపినట్లుగా తప్పుడు ఆరోపణలు చేసి పార్టీ ప్రతిష్టను దిగజార్చారని ఆరోపించారు. ఆప్‌ చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని ప్రవీణ్‌ శంకర్‌ కపూర్‌ పేర్కొన్నారు.
 
ఇదిలా ఉండగా, ఢిల్లీ మద్యం పాల కేసులో సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌ అనంతరం ఓ సమావేశంలో మంత్రి అతిషి మాట్లాడుతూ బీజేపీ ఒక్కొక్క ఎమ్మెల్యేకు రూ.25కోట్ల ఆఫర్‌ చేస్తూ నేతలను కొనేందుకు ప్రయత్నిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ప్రయత్నం చేస్తుందని,  ఏడుగురు ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించిందని ఆమె ఆరోపించారు. 
 
ఆప్ చేసిన ఆరోపణలను బీజేపీ కోట్టిపడేసింది. ఆ తర్వాత కూడా అతిషి మళ్లీ ఆరోపణలు చేశారు. తన సన్నిహితుల ద్వారా బీజేపీ తనను సంప్రదించిందని, తనను బీజేపీలో చేరాలని కోరారని చెప్పారు. పార్టీ మారితేనే తన రాజకీయ జీవితం నిలబడుతుందని అన్నారని, పార్టీ మారకపోతే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను ఒక నెలలోగా అరెస్టు చేస్తుందని బెదించారని ఆ,ఏ ఆరోపించారు. ఈ కేసులో బీజేపీ పరువు నష్టం కింద నోటీసులు పంపింది. బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసింది.