బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వండి

బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) మరోమారు డిమాండ్‌ చేసింది. ఎన్డీయేలో భాగస్వామ్యంగా ఉన్న ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసింది. బీహార్‌ ఆర్థికంగా, అభివృద్ధిలో వెనుక ఉండటాన్ని ప్రస్తావించింది. 
ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని, దీర్ఘకాలంగా ఉన్న ఈ డిమాండ్‌ను నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. 

హోదా లేకుంటే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని కోరింది. కాగా, జ‌న‌తాద‌ళ్ యునైటెడ్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎంపీ సంజ‌య్ జాను నియ‌మించారు. నితీష్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో రెండు ముఖ్యమైన ప్రతిపాదనలు ఆమోదం పొందాయి. అవి ఒకటి సంజయ్ ఝా నియామకం. రెండు జేడీయూ, ఎన్డీయే కూటమిలోనే కొనసాగడం. ఈ నిర్ణయాలకు సభ్యులు ఆమోదం తెలిపారు.

కాగా, బీహార్‌లో ఇటీవల 65 శాతానికి పెంచిన రిజర్వేషన్ కోటాను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను కూడా ఈ తీర్మానంలో పేర్కొన్నారు. న్యాయపర పరిశీలన, రక్షణ కోసం రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్‌లో రిజర్వేషన్‌ కోటాను చేర్చాలని జేడీయూ ప్రతిపాదించింది. అలాగే ఈ కోటాను నిరంతరాయంగా అమలు చేస్తామని జేడీయూ హామీ ఇచ్చింది.

మరోవైపు జేడీయూ కీలక సమావేశం తర్వాత ఆ పార్టీ సీనియర్‌ నేత మీడియాతో మాట్లాడారు. బీహార్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా డిమాండ్ కొత్తది కాదని తెలిపిరు. బీహార్ అభివృద్ధిని వేగవంతం చేయడం, రాష్ట్ర ప్రత్యేక సవాళ్లను పరిష్కరించడంలో ఇది కీలకమని అన్నారు. అంతేకాకుండా బీహార్‌ను అభివృద్ధి మార్గంలో పరుగులు పెట్టించడం.. బీహార్‌కు ఉన్న ప్రత్యేక సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక హోదా సాధించడం అనేది కీలకమైన అడుగు అని తెలిపారు.

దేశంలో ప్రత్యేక హోదా సాధించేందుకు ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు కొంతకాలంగా పోరాటం చేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో బీజేపీకి సొంతంగా బలం ఉండటంతో ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటూ పట్టించుకోలేదు. కానీ ప్రస్తుతం కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పాటులో టిడిపి, జెడియు మద్దతు కీలకం కావడంతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తున్నది.