కర్ణాటకలో ముదురుతున్న కాంగ్రెస్ కుమ్ములాటలు

కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికలు ముగిసే వరకు నిశ్శబ్దంగా ఉన్న కాంగ్రెస్‌ నేతల మధ్య కుమ్ములాటలు ఇప్పుడు తీవ్రతరమవుతున్నాయి.  ఏడాది పాలన ముగియడం, లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో మళ్లీ ఆధిపత్యపోరు రాజకీయాలు తీవ్రమవుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు చెక్‌ పెట్టేందుకు సిద్ధరామయ్య వర్గం మరో ముగ్గురిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. 
 
మరోవైపు సిద్ధరామయ్య ఇక ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దిగిపోయి శివకుమార్‌కు అప్పగించాలని ఆయన వర్గం కొత్త రాగం అందుకున్నది. దీంతో కర్ణాటక కాంగ్రెస్‌ రెండు వర్గాలుగా చీలిపోయింది. డీకేను నిలవరించేందుకు సిద్ధరామయ్య, సిద్ధరామయ్యకు ఎసరు పెట్టేందుకు డీకే తెరవెనుక ఉండి తమ వర్గీయులతో బాహాటంగా ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు.
తాజాగా, డీకే శివ‌కుమార్‌ను సీఎం చేయాల‌ని, ఆ ప‌ద‌విలో ఉన్న సిద్ద‌రామ‌య్య త‌ప్పుకోవాల‌ని వ‌క్క‌లింగ వ‌ర్గానికి చెందిన ప్ర‌ముఖ మ‌ఠాధిప‌తి కుమార చంద్ర‌శేఖ‌ర‌నాథ స్వామి ముఖ్యమంత్రి సమక్షంలోనే చెప్పడం రాజకీయ దుమారం రేపుతోంది. బెంగుళూరు వ్య‌వ‌స్తాప‌కుడు కెంపెగౌడ 515వ జ‌యంతి ఉత్స‌వాల సంద‌ర్భంగా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న ఈ విష‌యాన్ని తెలిపారు. డిప్యూటీ సీఎం శివ‌కుమార్ కూడా వ‌క్క‌లింగ కులానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం.

ప్రస్తుతం కర్ణాటకలో డీకే శివకుమార్‌ మాత్రమే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఆయనతో పాటు లింగాయత్‌, ఎస్సీ/ఎస్టీ, మైనారిటీ వర్గాల నుంచి ఒక్కొక్కరి చొప్పున మరో ముగ్గురిని డిప్యూటీ సీఎంలుగా నియమించాలని మంత్రి కేఎన్‌ రాజన్న డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌లో ఒక్కరికి ఒకే పోస్టు ఇవ్వాలనే పద్ధతి ఉందని, ఈ పద్ధతిని పాటించి డీకే శివకుమార్‌ తన పీసీసీ అధ్యక్ష పదవిని వదులుకోవాలని సైతం రాజన్న పేర్కొన్నారు. 

డీకే శివకుమార్‌కు చెక్‌ పెట్టేందుకు సీఎం సిద్ధరామయ్య వర్గం ఈ రెండు వాదనలను తెరపైకి తెచ్చినట్టు సమాచారం.  లోక్‌సభ ఎన్నికలకు ముందే మరిన్ని సామాజిక వర్గాలకు ఉపముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చినా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హెచ్చరికతో ఎన్నికల దాకా మౌనం పాటించారు.

డీకే శివకుమార్‌కు వ్యతిరేకంగా సిద్ధరామయ్య వర్గం పావులు కదుపుతుండటంతో డీకే వర్గం కూడా అప్రమత్తమైంది. సిద్ధరామయ్య సీఎం పదవిని వదిలి శివకుమార్‌కు అప్పగించాలని చెన్నగిరి ఎమ్మెల్యే బసవరాజు శివగంగ బుధవారం డిమాండ్‌ చేశారు.  సిద్ధరామయ్య గతంలో ఐదేండ్లు, ఇప్పుడు ఏడాదిన్నర సీఎంగా ఉన్నారని, ఇక దిగిపోవాలని స్పష్టం చేశారు.

మరో ముగ్గురు డిప్యూటీ సీఎంలను నియమించాలనే వాదనను కూడా డీకే వర్గం తప్పుపడుతున్నది. డిప్యూటీ సీఎం పదవి ఖాళీ లేదని మంత్రి చెలువరాయస్వామి.. సిద్ధరామయ్య వర్గానికి కౌంటర్‌ ఇచ్చారు. మరో సీనియర్‌ మంత్రి ప్రియాంక ఖర్గే స్పందిస్తూ మంత్రులందరినీ డీసీఎంలు చేస్తే సరిపోతుందని అంటూ ఎద్దేవా చేశారు. 

వివిధ సామాజిక వర్గాలకు ఉపముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టాలనే ప్రతిపాదన చేస్తూ తనను కట్టడి చేయాలని చూస్తున్న వారిపై పిసిసి అధ్యక్షుడిగా కూడా ఉన్న డీకే శివకుమార్‌ ఎదురు దాడికి సిద్దమవుతున్నట్లు తెలుస్తున్నది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత కోర్టు కేసు కోసం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ బెంగళూరుకు వచ్చిన సందర్భంగా ఓటమిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని, ఎవరు పనిచేయలేదో సంబంధిత ఇన్‌చార్జ్‌లపై చర్యలు తీసుకోవాలని సూచించారు. 

రాహుల్‌గాంధీ సూచనలను ఆసరాగా తీసుకొని బెంగళూరుతోపాటు మైసూరు, దక్షిణకన్నడ, మండ్య, ఉత్తరకర్ణాటక ప్రాంతాల్లో ఇన్‌చార్జిలుగా వ్యవహరించినవారు సిద్దరామయ్యకు ఆప్తులు కావడంతో వీరిపై వ్యతిరేకంగా నివేదిక రూపొందించడం ద్వారా కట్టడి చేయాలని డీకే శివకుమార్‌ భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. 

మరోవైపు మాజీ మంత్రి వినయ్‌కులకర్ణి నేతృత్వంలో 15 మంది వీరశైవలింగాయత ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లి సీఎం ఆప్తమంత్రులు తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఫిర్యాదు చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా బైరతి సురేశ్‌, కేఎన్‌ రాజణ్ణను టార్గెట్‌ చేస్తూ ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. సిద్దరామయ్యను ఢిల్లీలో ఇరకాటంలో పెట్టేలా లక్ష్యంగా ఉన్నట్టు తెలుస్తోంది.

లోక్‌సభ ఎన్నికల్లో ఊహించినన్ని సీట్లు రాకపోవడంతో కాంగ్రెస్‌ గ్యారెంటీలు రద్దు అవుతాయని బీజేపీ చేస్తున్న ఆరోపణలను కొట్టివేసేందుకు ముఖ్యమంత్రి సిద్దరామయ్య తాను ముఖ్యమంత్రి పదవిలో లేకున్నా గ్యారెంటీలు కొనసాగుతాయని చెప్పడం మరిన్ని ఊహాగానాలకు తావిస్తోంది.