దేశంలో తగ్గుముఖం పడుతున్న గృహ విక్రయాలు

కరోనా తదనంతరం దేశంలో ఎక్కడ చూసినా ఇళ్ల ధరలు భారీగా పెరిగిపోయాయి. అయినా డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. అదే రీతిలో ఇళ్ల విక్రయాలు కూడా రికార్డు స్థాయిలో పెరుగుకుంటూనే పోయాయి. అయితే గత రెండు సంవత్సరాల్లో చూస్తే ఇప్పుడు తొలిసారిగా గృహ విక్రయాలు పడిపోవడం గమనార్హం.
 
దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ క్యాలెండర్ ఇయర్ రెండో త్రైమాసికం అంటే,  ఏప్రిల్ – జూన్ సమయంలో గృహ విక్రయాలు అంతకుముందు త్రైమాసికంతో చూస్తే 8 శాతం తగ్గిపోయాయి. అయితే అంతకుముందు సంవత్సరం ఇదే క్వార్టర్‌తో చూస్తే మాత్రం కొంత మేర పెరిగిందని చెప్పొచ్చు. ఈ మేరకు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ అనరాక్ తన రిపోర్టులో వెల్లడించింది. 
 
2024 సంవత్సరంలో క్యూ2లో (ఏప్రిల్- జూన్) మొత్తం టాప్- 7 ముఖ్య నగరాల్లో 1,20,340 యూనిట్లు అమ్ముడుబోగా, ఇది క్యూ1 లో అంటే జనవరి- మార్చి సమయంలో 1,30,170 గా ఉంది. త్రైమాసికం ప్రాతిపదికన గృహ విక్రయాలు పెరిగింది కేవలం ఎన్ సి ఆర్ రీజియన్‌లో మాత్రమే. క్నయు1 తో చూస్తే ఇక్కడ 6 శాతం మేర విక్రయాలు పెరిగాయి.
 
ఇదే సమయంలో అంతకుముందు ఏడాది ఇదే సమయంతో పోలిస్తే మాత్రం ఈ 7 నగరాల్లో ఇళ్ల విక్రయాలు 5 శాతం మేర పుంజుకున్నాయి. ముఖ్యంగా ఈ రెండో త్రైమాసికంలో గృహ విక్రయాలు పడిపోయేందుకు ప్రధాన కారణం అంతకుముందు త్రైమాసికంలో హోమ్ సేల్స్ ఆల్ టైమ్ గరిష్టాలకు చేరడమేనని అనరాక్ గ్రూప్ ఛైర్మన్ అనుజ్ పురీ తెలిపారు. ఇంకా అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇళ్ల ధరలు పెరగడం సహా ఎన్నికలు జరగడం, ఎండలు వంటివి ప్రభావం చూపించాయని పేర్కొన్నారు.

మొత్తం క్యూ 2 ఇళ్ల విక్రయాల్లో 52 శాతం ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, పుణెదే ఉంది. 7 ప్రధాన నగరాల్లో ఇక్కడే 62,685 యూనిట్లు అమ్ముడుబోయాయి. చివరిసారిగా 2022లో ఇలాగే ఏప్రిల్- జూన్ లో విక్రయాలు 15 శాతం మేర పతనం అయ్యాయి. అప్పుడు జనవరి- మార్చిలో 99,550 ఇళ్ల విక్రయం జరగ్గా.. రెండో త్రైమాసికానికి వచ్చే సరికి ఇది 84,925 యూనిట్లకు దిగొచ్చింది.

 
జనవరి- మార్చితో పోలిస్తే సెకండ్ క్వార్టర్‌లో ఇళ్ల రేట్లు 7 శాతం మేర పెరిగినట్లు అనరాక్ వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఈ పెరుగుదల 25 శాతంగా ఉందని తెలిపింది. కిందటి త్రైమాసికంతో చూస్తే ఇళ్ల రేట్లు ఢిల్లీ- ఎన్ సి ఆర్ లో 10 శాతం పెరగ్గా హైదరాబాద్‌లో 9 శాతం పెరిగాయని, బెంగళూరులో 8 శాతం పెరిగినట్లు పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఇళ్ల విక్రయాలు హైదరాబాద్‌లో 11 శాతం పెరిగినట్లు అనరాక్ వివరించింది.