ఒవైసీ ఇంటి నేమ్‌ ప్లేట్‌పై నల్ల ఇంక్‌ పూసిన దుండగులు

ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఢిల్లీలోని ఇంటిపై మరోసారి దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు అశోక్‌ రోడ్డులోని ఆయన నివాసంపై దాడికి పాల్పడ్డారు. ఇంటి నేమ్‌ ప్లేట్‌, గేటుపై నల్ల ఇంకు చల్లి ఆయన పేరు కనిపించకుండా చేశారు.  దీంతోపాటు ఇజ్రాయేల్‌ అనుకూల పోస్టర్లు అతికించారు.. ఇటీవల ఎంపీగా ప్రమాణం చేసిన సమయంలో ‘జై పాలస్తీనా’ అంటూ అసదుద్దీన్ ఒవైసీ లోక్‌సభలో నినదించారు.
ఇది జరిగిన రెండు రోజులకే ఆయన నివాసం వద్ద ఇజ్రాయేల్‌ అనుకూల పోస్టర్లు అతికించడం గమనార్హం.  సెంట్రల్ ఢిల్లీలోని 34 అశోకా రోడ్డులో ఉన్న హైదరాబాద్ ఎంపీ ఒవైసీ ఇంటికి గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి.. గేట్లతోపాటు గోడలకు పోస్టర్లు అతికించారు. అనంతరం ఎంపీ ఇంటి నేమ్ బోర్డుపై నల్ల సిరా చల్లారు.  పోస్టర్లపై భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్‌ నినాదాలు రాసి ఉన్నాయి.
 
‘భారత్‌ మాతా కీ జై, ఐ స్టాండ్‌ విత్‌ ఇజ్రాయెల్, జై శ్రీరాం.. ఒవైసీని సస్పెండ్ చేయాలి’ అని అతికించిన ఆ పోస్టర్లలో రాశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  మరోవైపు, దీనిపై స్పందించిన పోలీసులు.. తక్షణమే అక్కడకు చేరుకుని పోస్టర్లను తొలగించారు. పోలీసుల చేరుకునేసరికి ఆందోళనకారులు అక్కడి నుంచి పరారయ్యారు. నిందితులను గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
 
 కాగా, దాడి విషయాన్ని ఎంపీ ఒవైసీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు.  ఇలాంటి పిరికిపంద చర్యలకు తాను భయపడేది లేదని చెప్పారు. గుర్తుతెలియని దుండగులు మా నివాసం వద్ద దుశ్చర్యకు పాల్పడ్డారు… ఇజ్రాయేల్ అనుకూల పోస్టర్లు అంటించి, నల్ల సిరా పోశారు. ఢిల్లీలోని నా నివాసం ఎన్నిసార్లు దాడులు చేశారో తెలియదు.. తరుచూ నన్ను లక్ష్యంగా చేసుకుంటున్నారు.. ఇలాంటి సంఘటనలను ఢిల్లీ పోలీసులు నిరోధించలేకపోయారని వ్యాఖ్యానించారు. 
 
అంతేకాదు, ట్విట్టర్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ట్యాగ్ చేస్తూ.. ఆయన పర్యవేక్షణలోనే ఈ సంఘటనలు జరిగాయని ఆరోపించారు. ‘‘ఇది ఎలా జరుగుతోందని నేను ఢిల్లీపోలీసు అధికారులను అడిగితే వారు నిస్సహాయత వ్యక్తం చేశారు… కేంద్ర మంత్రి అమిత్‌షా మీ పర్యవేక్షణలోనే ఇది జరుగుతోంది. స్పీకర్ ఓం బిర్లా దయచేసి ఎంపీల భద్రతకు హామీ ఇస్తారో లేదో మాకు చెప్పండి’ ఒవైసీ ప్రశ్నించారు.