ఎన్టీఆర్, రామోజీరావులకు భారతరత్న ఇవ్వాలి

తెలుగుజాతికి ఆయన చేసిన సేవలకు గానూ తగిన గుర్తింపు రావాలని ఎన్టీఆర్‌, రామోజీరావులకు భారతరత్న సాధించడం మన బాధ్యత అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. విజయవాడ శివారులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు సంస్మరణ సభలో పాల్గొంటూ  రామోజీరావు ప్రజల ఆస్తి ఆయన స్థాపించిన వ్యవస్థలను భావితరాలకు అందించాలని సూచించారు.
 
ఢిల్లీ విజ్ఞాన్ భవన్ తరహాలో సదస్సులు, పరిశోధనల కోసం అమరావతిలో రామోజీ విజ్ఞాన్ కేంద్రం పెడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే అమరావతిలో ఓ రోడ్డుకు రామోజీరావు మార్గం అని పేరు పెడతామని, ఆయన జీవితం ప్రారంభించిన విశాఖలో చిత్ర నగరి పేరుతో సినిమా షూటింగ్స్ కోసం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

ఏ కార్యక్రమాన్ని చేసినా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ పోరాటం చేసిన యోధుడు రామోజీరావు అని చంద్రబాబు ప్రశంసించారు. సినీ, మీడియా, వ్యాపార రంగాల్లో ఆయన రాణించారని చెబుతూ మీడియాలో ఆయన చేసిన కృషికి యుధ్ వీర్, వీడీ గోయెంకా వంటి అవార్డులు వరించాయని గుర్తు చేశారు. కేంద్రం కూడా పద్మవిభూషణ్ ఇచ్చి గౌరవించిందని తెలిపారు.
మారుమూల గ్రామంలో పుట్టి పట్టుదలతో అత్యున్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి రామోజీ రావు అని సీఎం చంద్రబాబు కొనియాడారు. రామోజీరావు వ్యక్తికాదు ఓ వ్యవస్థ అని చెబుతూ ఆయన ఏ పని చేసినా ఎప్పుడూ ప్రజాహితం కోరుకునే వారని చెప్పారు.ఎంచుకున్న ప్రతి రంగంలో నెంబర్‌వన్‌గా ఎదిగారని తెలిపారు. 1974 ఆగస్టు 10న ఈనాడు పత్రిక విశాఖలో ప్రారంభించారని ఐదు దశాబ్దాలుగా ఆ పత్రిక అనునిత్యం ప్రజా చైతన్యం కోసం పని చేస్తోందని పేర్కొన్నారు. 
 
రామోజీరావు పత్రికారంగంలో ఉండి నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడారని గుర్తు చేశారు. జిల్లా ఎడిషన్లు తెచ్చి క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలు ప్రస్తావించారని ఎంతో మంది నటులు, కళాకారులు, జర్నలిస్టులకు జీవితం ఇచ్చిన గొప్ప వ్యక్తి రామోజీ అని చంద్రబాబు కొనియాడారు.  మార్గదర్శి సంస్థను దెబ్బతీయాలని అనేక ప్రభుత్వాలు ప్రయత్నించాయని చెబుతూ  ఏం చేసినా ఆ సంస్థపై నమ్మకాన్ని దెబ్బతీయలేకపోయారని తెలిపారు. ప్రియా పచ్చళ్లను 150 దేశాలకు ఎగుమతి చేశారని ఇంక రామోజీ ఫిల్మ్‌ సిటీని అద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు.
రామోజీరావు ప్రజల పక్షపాతి, జర్నలిస్ట్ విలువను కాపాడటంలో ముందున్నారని, ప్రజల కోసం ఏం చేయాలనే అంశాలపైనే ఆలోచించారని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. ఆయన జర్నలిస్టిక్ వారసత్వ విలువలను ప్రతి జర్నలిస్టు తీసుకోవాలని చెబుతూ అది ఎంతవరకు తీసుకుంటారో ప్రతి జర్నలిస్టు తెలుసుకోవాలని సూచించారు.

రాజస్థాన్ పత్రిక అధినేత గులాబ్ కొఠారి, ప్రముఖ పాత్రికేయుడు ఎన్‌. రామ్‌ పాల్గొన్నారు. సినీ ప్రముఖులు మురళీమోహన్, జయసుధ, రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను, అశ్వినీదత్‌, ఆదిశేషగిరిరావు, దగ్గుబాటి సురేష్‌, శ్యాంప్రసాద్‌రెడ్డి హాజరయ్యారు. మంత్రులు నారా లోకేశ్, మనోహర్‌, సత్యకుమార్‌, కొల్లు రవీంద్ర, పార్థసారథి పాల్గొన్నారు.