మిత్రుడు చంద్రబాబుతో కలిసి పనిచేస్తాం

మిత్రుడు చంద్రబాబుతో కలిసి పనిచేస్తాం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన మిత్రుడని, ఆయనతో కలిసి కేంద్రంలో, రాష్ట్రంలో అభివృధ్ధికోసం పనిచేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.  బుధవారం ఢిల్లీలో టీడీపీ ఎంపీలు ప్రధాని ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మోదీ  వారిని అప్యాయంగా పలకరించారు. వారితో కాసేపు మాట్లాడారు.

రాబోయే ఐదేళ్లు రాష్ట్రంలో, కేంద్రంలో తెలుగుదేశం, భారతీ జనతా పార్టీ కలిసి పనిచేస్తాయని ప్రధాని మోదీ ఈ సందర్భంగా చెప్పారు. తన మిత్రుడు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కలిసి పనిచేస్తామని ప్రధాని చెప్పుకొచ్చారు. దేశ, రాష్ట్ర అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తామంటూ ప్రధాని మోదీ ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు చేశారు.

ప్రధాని మోదీని కలిసిన వారిలో కేంద్రమంత్రులు రామ్మోహన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయులు, బైరెడ్డి శబరి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కలిశెట్టి అప్పలనాయుడు, తదితరులు ఉన్నారు.  కాగా, సార్వత్రిక ఎన్నికల్ల విజయం సాధించిన నేపథ్యంలో కేంద్రం, రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. కేంద్రంలో టీడీపీ ఎంపీలు, రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు.
 
అంతకుముందు 18వ లోక్‌సభ స్పీకర్ గా ఎన్నికైన ఓంబిర్లాకు కేంద్రమంత్రి రామ్మోహననాయుడు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించి ఎక్స్‌లో పోస్టు చేశారు. ’17వ లోక్‌సభలో మీ ఆదర్శవంతమైన నాయకత్వం ఉన్నత ప్రమాణాలను నెలకొల్పింది. మన దేశం శ్రేయస్సు,శ్రేయస్సు కోసం సభకు మార్గనిర్దేశం చేయడంలో మీరు విజయాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను’ అంటూ స్పీకర్ ఓంబిర్లాను ఉద్దేశించి రామ్మోహననాయుడు అభినందించారు. ఈ క్రమంలో స్పీకర్ ఓంబిర్లా ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.