29 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర.. జమ్మూల్లో టోకెన్ల జారీ

అమర్‌నాథ్‌ యాత్ర ఈ నెల 29న మొదలవనున్నది. యాత్రకు ముందురోజు అంటే శుక్రవారం మొదటి బ్యాచ్‌ బేస్‌ క్యాంప్‌ భగవతినగర్‌ జమ్మూ నుంచి బల్తాల్‌, పహల్గామ్‌ బయలుదేరి వెళ్లనున్నాయి. ఈ క్రమంలో బుధవారం జమ్మూలోని సరస్వతి ధామ్‌లో ఇన్‌స్టంట్‌ రిజిస్ట్రేషన్‌ కోసం టోకెన్ల జారీ మొదలైంది. తొలిరోజు బల్తాల్, పహల్గాం నుంచి వెళ్లేందుకు సుమారు 1000 టోకెన్లు జారీ చేశారు. 
 
యాత్రికులు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు జనం భారీగా తరలివచారు. సరస్వతి ధామ్‌కు తెల్లవారుజామున 4 గంటల నుంచి యాత్రికులు చేరుకొని.. క్యూలైన్లలో బారులు తీరారు. బంగ్లాదేశ్‌ నుంచి సైతం నలుగురు భక్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకొని జమ్మూకు చేరుకున్నారు. భద్రతలో ఎలాంటి లోపం లేకుండా చూసేందుకు భద్రతా బలగాలు మార్క్ డ్రిల్ నిర్వహించి, ఏర్పాట్లను పరిశీలించాయి. 
 
ఇటీవల ప్రయాణికుల వాహనంపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భద్రతా బలగాలను భారీగా మోమరించారు. డ్రోన్లు, 365 డిగ్రీస్‌ యాంగిల్ సీసీ కెమెరాల సాయంతో వాహనాల రాకపోకలను పర్యవేక్షిస్తున్నారు. జమ్మూ-శ్రీనగర్ హైవేపై ప్రతి 500 మీటర్లు, కిలోమీటరుకు సెక్యూరిటీ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ 24 గంటలూ సాయుధ సైనికులను మోహరించి తనిఖీలు చేయనున్నారు. 
 
అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లే వారంతా సాయంత్రం 7గంటల్లోగా భగవతినగర్‌లోని బేస్‌ క్యాంప్‌లోకి ప్రవేశించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. యాత్ర కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారంతా ఇప్పటికే జమ్మూకు తరలివస్తున్నారు. యాత్రికుల కోసం తక్షణ రిజిస్ట్రేషన్ గురువారం ఉదయం వైష్ణవి ధామ్, పంచాయతీ భవన్, రైల్వే స్టేషన్ సమీపంలోని మహాజన్ హాల్.. అలాగే, పురాణి మండిలోని శ్రీరామ దేవాలయం, గీతా భవన్ (సాధుల కోసం) వద్ద మొదలవనున్నది.